మామిళ్లగూడెం, మే 10: నగరంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆ భవనాన్ని ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటనలు జారీ చేసి నిరుద్యోగ యవతకు ఉచితంగా శిక్షణలు అందిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు నూతన భవనం అందుబాటులోకి తేవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ భవనంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసుకుంటున్న లైబ్రరీ, స్టడీ రూమ్స్,డార్మిటరీ, కిచెన్, డైనింగ్‌హాల్, టీచింగ్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను పరిశీలించారు. నూతన భవనంలో స్టడీ సర్కిల్ ప్రారంభించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ఎండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి జ్యోతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావొద్దు
యాసంగి ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ రైస్ మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలు, ఎఫ్‌సీఐ, మార్కెటింగ్ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్‌కు లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గాను ఇప్పటి వరకు 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. వానకాలానికి సంబంధించి మిల్లింగ్ చేసిన బియ్యం లక్షా 10వేల మెట్రిక్ టన్నులు ఇంకా మిల్లర్ల వద్ద ఉన్నాయని, వాటిని వెంటనే ఎఫ్‌సీఐ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా సహకార అధికారి విజయకుమారి, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ సోములు, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, ఇన్చార్జి డీఏవ సరిత, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాలియేటివ్‌కేర్ సేవలను మెరుగుపర్చాలి
జిల్లాలో పాలియేటివ్ కేర్ సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపశమన సంరక్షణ, 108 వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ తదితర సేవలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, జిల్లా ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆరోగ్యశ్రీ మేనేజర్ శ్రీనివాస్, వైద్యాధికారులు డాక్టర్ స్వప్న, డాక్టర్ కోటి రత్నం, 108 కో ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
పనులు పెండింగ్ ఉండొద్దు
మేజర్ పంచాయతీల్లో పనులు పెండింగ్ ఉండొద్దని, తక్షణమే వాటిని పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. పెద్దతండా, ఏదులాపురం, పాలేరు, పండితాపురం, చిన్నమండవ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, సంతల నిర్వహణ, పన్నుల వసూళ్లపై మంగళవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇన్చార్జి డీపీవో వీవీ అప్పారావు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, సర్పంచ్‌లతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాలేరు, పండితాపురం సంతల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వ్యాపారులు, కొనుగోలుదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఆదాయ వనరులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లను నూరు శాతం సాధించాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు శ్రీనివాసరెడ్డి, అశోక్, కరుణాకర్‌రెడ్డి, షేక్ సిలార్‌సాహెబ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.