అశ్వారావుపేట/ ములకలపల్లి/ దమ్మపేట, మే 10: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు పేర్కొన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం కల్పించి బడ్జెట్లో నిధులు కేటాయించిన ఘనత ఆయనే దక్కుతుందని స్పష్టం చేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలతో కలిసి అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత ములకలపల్లిలోని రైతువేదిక ఆవరణలో మొక్కను నాటి రైతువేదికను ప్రారంభించారు. అనంతరం ములకలపల్లి – మొగరాలగుప్ప పీఎంజీఎస్‌వై కింద రూ.1.88 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అక్కడి నుంచి అదే రహదారిపై గొల్లగూడెం శివారులో పాములేరు వాగుపై పీఎంజీఎస్‌వై నిధులు రూ.3.54 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెనకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత రైతువేదిక ఆవరణలో ఎంపీపీ మట్ల నాగమణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణలో తప్ప అన్ని రాష్ర్టాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు కరెంటు కోతలు విధిస్తున్నాయని గుర్తుచేశారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహవినియోగానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ రైతులను చర్చించి వాటిని పరిష్కరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలను నిర్మించిందని అన్నారు.
దమ్మపేట మండలంలో..
దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం, మల్కారం గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలతోపాటు పార్కలగండిలో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పట్వారిగూడెం రైతువేదికలో ఆరుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పట్వారిగూడెం, మల్కారం రైతువేదికల్లో ఎమ్మెల్యేతో కలిసి ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో రైతులు సాగుచేసే పామాయిల్ పంట దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతుంటే అందులో సగం కేవలం అశ్వారావుపేట నియోజకవర్గంలోనే సాగవుతోందని గుర్తుచేశారు. మరో మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు పామాయిల్ సాగు పెరుగుతుందని ఎంపీ నామా స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనాలని పార్లమెంట్లో సైతం కేంద్రంపై ఆందోళనకు దిగామని, అయినా కేంద్రం స్పందించలేదని అన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆరే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు. నాచారంలో శివాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అశ్వారావుపేట మండలంలో..
మండలంలోని మారుమూల గ్రామాలను కలుపుతూ రూ.3.4 కోట్లతో మద్దికొండ నుంచి ఉట్లపల్లి రోడ్డు వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. హరితహారం మొక్కలు నాటిన అనంతరం పలు కుటుంబాలను పరామర్శించారు. నారంవారిగూడెంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, కర్నాటి వెంకటేశ్వర్లు, అభిమన్యుడు, అఫ్జల్‌బేగం, సీతారాములు, నాగేశ్వరరావు, వీరభద్రం, చంద్రశేఖర్, రంగా ప్రసాద్, పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, దొడ్డాకుల రాజేశ్వరరావు, కేవీ, జారే ఆదినారాయణ, జల్లిపల్లి శ్రీరామూర్తి, చిన్నంశెట్టి వరలక్ష్మి పాల్గొన్నారు.