భద్రాద్రి కొత్తగూడెం, మే 10 (నమస్తే తెలంగాణ) : ముహూర్తాల ప్రకారం ప్రసవాలు కావాలనే వారిని ప్రోత్సహించొద్దని, జాప్యం చేయక ప్రసవాలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సూచించారు. రామవరంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించారు. ఎర్లీ ఇన్వెస్టిగేటింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. చికిత్సల కోసం వచ్చిన ప్రజలను వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకుల కోసం ఆస్పత్రి బయట స్థలంలో మరుగుదొడ్లు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆస్పత్రి నుంచి వెలువడే బయో వ్యర్థాలను ఆరు బయట వేయొద్దని సూచించారు.
పరిసరాల పరిశుభ్రత బావుందంటూ మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. ఆస్పత్రి ప్రాంగణంలో మాతా శిశు విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ప్రహరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సురక్షిత తాగునీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటుతో పాటు మూడు వాటర్ కూలర్లు ఏర్పాటు ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ సరళ, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు.
25 నాటికి కలెక్టరేట్ పూర్తి కావాలి
సమీకృత కలెక్టరేట్‌ను పూర్తి హంగులతో ఈ నెల 25 నాటికి పూర్తి చేసి అందించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం ముందు గ్రీనరీ కోసం లాన్ ఏర్పాటును పరిశీలించారు. కార్యాలయంలోకి వచ్చే రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు నాటాలన్నారు. కార్యాలయాల అన్ని విభాగాలను, కలెక్టర్, అదనపు కలెక్టర్ సిబ్బంది నివాస సముదాయాలను పరిశీలించారు. రోడ్లు, భవనాల ఈఈ భీమ్లా, ఉద్యాన అధికారి మరియన్న, ఎప్డీవో అప్పయ్య, డీఈలు రమణ, నాగేశ్వరరావు, సైట్ ఇంజినీర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.