ఖమ్మం, మే 10: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వృత్తి నైపుణ్యంతోపాటు అంకితభావంతో విధులు నిర్వర్తించడమే సంస్థకు శ్రీరామరక్ష అని కరీంనగర్ జోనల్ ఈడీ వీర్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్న ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈడీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారిగా ఖమ్మం డిపోకు వచ్చిన ఆయనకు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఈడీ వెంకటేశ్వర్లు, ఆర్ఎం ప్రభులత కలిసి డిపో ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ శంకర్రావు అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో ఈడీ మాట్లాడారు. ఖమ్మం డిపో ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులుగా ఎండీ నుంచి అవార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. సంస్థ ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో వృత్తి నైపుణ్యంతోపాటుగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ప్రయాణికుల ఆదరణను చూరగొనాలని, సంస్థకు నష్టాలకు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పెరిగిన డీజిల్ ధరలు సంస్థకు భారంగా మారాయని, ప్రయాణికుల ఆదరణను మరింత పొందడం ద్వారా భారాలను అధిగమిద్దామని అన్నారు. డివిజనల్ మేనేజర్ ఎస్.భవానీ ప్రసాద్, డిపో అసిస్టెంట్ మేనేజర్ టీ.స్వామి, అసిస్టెంట్ ఇంజినీర్ పీ.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.