రామవరం, మే 8: సింగరేణి క్రీడా ఆణిముత్యం ఎస్కే గౌస్. కోల్ఇండియా స్థాయిలోనూ తగ్గేదే..లే అంటూ క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకం ద్వారా 2006లో బెల్లంపల్లిలో బదిలీ వర్కర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఉద్యోగం చేరినప్పటి నుంచి ఒకవైపు విధులు నిర్వహిస్తూనే సింగరేణి నిర్వహించే ఏ ఆటలోనైనా తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బహుమతులు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గౌస్ కొత్తగూడెం ఏరియా ఎస్అండ్పీసీ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, అథ్లెటిక్స్, షటిల్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని ఆటల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కోల్ ఇండియా స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో బహుమతులు, గోల్డ్‌మెడల్ కూడా సాధించాడు. తన క్రీడా ప్రతిభకు సింగరేణి అధికారులు సహకారం అందించారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు సాధించి సింగరేణి సంస్థను కోల్ ఇండియాలో ముందు వరుసలో ఉంచేందుకు ఆహర్నిశలు శ్రమిస్తానని అంటున్నాడు గౌస్.
అరుదైన రికార్డులు
కోల్ఇండియా 2018-19లో మణుగూరులో జరిగిన హాకీ టోర్నమెంట్లో బంగారు పథకాన్ని సాధించాడు. 2017-18లో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నాగ్‌పూర్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అదే టోర్నమెంట్లో బెస్ట్ బౌలర్‌గా ఎన్నికయ్యాడు. 2016-17 సంవత్సరంలో రామగుండంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో బ్రౌన్స్ మెడల్, 2013, 2015, 2018 నార్తన్ కోల్ ఫీల్డ్స్ నిర్వహించిన అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యాడు. 2013 కోల్ ఇండియాలో నిర్వహించిన ఫుట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. సింగరేణిలో ఫుట్‌బాల్‌లో బెస్ట్ డిఫెండర్‌గా నిలిచాడు.
అధికారుల ప్రోత్సాహం.. కుటుంబసభ్యులు ఆదరణ మర్చిపోలేనిది
సింగరేణిలో ఉద్యోగం చేస్తూ క్రీడల్లో రాణించడం చాలా సంతోషంగా ఉంది. సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం మరువలేనిది. నైపుణ్యం ఉన్నవారికి సింగరేణి ఎప్పటికీ సహకారం అందిస్తుంది. అధికారులు, కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం సింగరేణి యువకుల ప్రాతినిధ్యం పెరగడంతో యువకులు క్రీడల్లో రాణించి సింగరేణి సంస్థను ముందువరుసలో ఉంచాలని కోరుకుంటున్నా. సింగరేణి క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని యువత అందిపుచ్చుకోవాలి.
– షేక్ గౌస్, ఎస్అండ్పీసీ సెక్యూరిటీ గార్డు, కొత్తగూడెం ఏరియా