ఖమ్మం కల్చరల్ మే 8 : నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆరురోజులుగా జరుగుతున్న ప్రముఖ నాటకరంగ సమాజం సురభి నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థ సహకారంతో శ్రీసాయి సంతోషి సురభి నాట్యమండలి ఆధ్వర్యంలో నాటకోత్సవాలు రసరమ్యంగా సాగాయి. కళాకారులు శ్రీకృష్ణలీలలు, మాయాబజార్, లవకుశ, జైపాతాళభైరవి, శ్రీసమ్మక్క సారలమ్మ, బాలనాగమ్మ నాటకాలను ప్రదర్శించారు. శ్రీ సాయి సంతోషి నాట్యమండలి అధ్యక్షుడు సురభి సంతోష్ ఆధ్వర్యంలో 50మంది కళాకారుల బృందం ఈ నాటకాలను ప్రదర్శించారు. సినిమాకు దీటుగా, యానిమేషన్, గ్రాఫిక్స్‌కు సవాల్‌గా రంగస్థలంపై అనేక అద్భుతాలు ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ప్రేక్షకుల ముందే ప్రత్యక్షంగా మాయలు, విన్యాసాలతో, భారీసెట్టింగ్లతో అనేక సన్నివేశాలను కళ్ల ముందు కనికట్టు చేశారు. ఆయా నాటకాల సన్నివేశాల వింత అనుభూతులు ఇతర లోకాలకు తీసుకెళ్లారు. ప్రేక్షకుడికి, నటుడికి ప్రత్యక్ష సంబంధం కలిగించే నాటకరంగ సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
ప్రతి రోజు సభ నిర్వహించి కళాకారుల సత్కారం, సందేశాలతో రంగస్థల వైభవాన్ని నెమరవేశారు. 137 సంవత్సరాల చారిత్ర కలిగిన సురభి సమాజం నాటక రంగానికి చేస్తున్న సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆదివారం 40మంది కళాకారులు మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శించారు. అభిమన్యుడు శశిరేఖ పరిణయం, ఘటోత్కచడి మాయాజాలం, శ్రీకృష్షుడి లీలల సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. రంగస్థలంపై భారీ సెట్టింగ్‌లతో మేఘాలలో నారదుడి పర్యటన తదితర సన్నివేశాలు అబ్బురపర్చాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సురభి రంగ వ్యవస్థపై పరిశోధన చేసిన డాక్టర్ నిభానపూడి సుబ్బరాజు సురభి సమాజ చరిత్ర, కళాకారుల జీవిత సంఘటనలను వివరించారు. బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు మాట్లాడుతూ రంగస్థల కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కళాభిమానులపై ఉందన్నారు. సభలో నాటకోత్సవాల నిర్వాహకుడు సురభి సంతోష్, కొండలరావు, కళా పోషకులు బి.సాయిప్రసాద్‌రెడ్డి, జానిపాషా, కొండపల్లి జగన్మోహన్రావు, రంగాచారి, నర్సింహారావు, శ్రీనివాసరావు, బాదం గిరిసాయి పాల్గొన్నారు.