భద్రాచలం, మే 8: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రంలో జగదభిరాముడికి ఆదివారం వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన శ్రీ రామ పునర్వసు దీక్షలు శనివారంతో ముగిశాయి. పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీరామ దీక్షాపరులతో పట్టాభిషేకం జరిపారు. రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించిన తర్వాత వేదికపై పట్టాభిషేకం జరిపారు. అర్చకులు సకల రాజలాంఛనాలతో గోదావరి నుంచి పుణ్యజలాలను తీసుకొచ్చి భద్రుడి కోవెలలో స్వామివారి పాదుకలకు అభిషేకం చేశారు. రామదాసు సీతారామలక్ష్మణ మూర్తులకు తయారు చేయించిన దివ్య వర్ణాలను స్వామి వారికి అలంకరించారు. అనంతరం చతుస్థానార్చన, నామస్మరణ అష్టోత్తర నామార్చన, సహస్ర నామార్చన హోమం నిర్వహించారు. పంచ నదుల తీర్థ జలాలతో ప్రోక్షణ చేసి ఆ తీర్థాన్ని అష్ట దిక్కుల్లో చల్లారు. అర్చకులు పట్టాభిషేక విశిష్టతను వివరించారు. రామయ్యకు కత్తి, డాలు రాజముద్రిక, రాజదండం అలంకరించారు. పట్టాభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను అంతరాలయంలోకి తీసుకెళ్లారు.