మామిళ్లగూడెం, మే 5: జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి కోసం మత్స్య రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మత్స్య సంపద, రైతుల అభివృద్ధిపై గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మత్స్య, నీటి పారుదల, వ్యవసాయశాఖల అధికారులు, శాస్త్రవేతలు, మత్స్య రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి చర్యలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మత్స్య రైతుల, మత్స్య సంపదను పెంపొందించేందుకు మత్స్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి నెలా రైతు వేదికల్లో రైతులు, మత్స్య రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, సదుపాయాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. రైతులను ప్రోత్సహించే విధంగా శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేసి మత్స్య సంపద ఉత్పత్తి పెంచే చర్యల పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయులు, ఇన్చార్జి డీఏవో సరిత, కేవీకే శాస్త్రవేత్త హేమంత్‌కుమార్, పాలేరు రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త రవీందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును మరింతి విస్తరింప చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యానవనశాఖ, ఆయిల్‌పామ్ సంస్థల బాధ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో సాగు విస్తరణ చర్యలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలంలో కనీసం ఐదు వందల ఎకరాలకు తగ్గకుండా ఆయిల్‌పామ్ సాగు జరగాలన్నారు. కనీసం ప్రతి మండలంలో వంద మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతులు మొగ్గు చూపుతున్నారని, ఒకే ప్రాంతంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా రైతులు అయిల్‌పామ్ సాగు చేసే విధంగా చూడాలన్నారు. సుమారు 11 వేల ఎకరాలలో సాగుకు సరిపడా మొక్కలను సకాలంలో రైతులకు అందంచేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఆయిల్‌పామ్ సాగు రైతులకు అవసరమైన డ్రిప్‌లను మంజూరుకు మందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 2021-22 సంవత్సరానికి మంజూరైన లక్ష్యాలను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.