ఖమ్మం రూరల్, మే 4 : మద్దులపల్లి మార్కెట్ భవిష్యత్‌లో రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా మారనుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మద్దులపల్లి మార్కెట్ నిర్మాణానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ స్థలంలో ఎమ్మెల్యే కందాళ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి పాలనలో ఉనికి కోల్పోయిన వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్ నూతన ఒరవడి తీసుకొచ్చారన్నారు. తద్వార నేడు అపరాల, వాణిజ్య పంటలకు మంచి ధర పలుకుతున్నదన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గొప్ప పేరుందని, అంతటి స్థాయి మద్దులపల్లి మార్కెట్‌కు తీసుకరావాలన్నారు. రూ.20 కోట్లతో మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి సైతం కృషి చేస్తానని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం, వ్యవసాయరంగం అభివృద్ధిని జోడెడ్లుగా పరుగులు పెట్టిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండు దఫాలుగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మోదీ సొంత రాష్ట్రంలో నేడు కరెంటు కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణలో మాత్రం వెలుగులు విరజిమ్ముతున్నాయని, యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మొదలు నుంచి మార్కెటింగ్ వరకు అడుగడుగునా అండగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
వేలాది మందికి ఉపాధి: మంత్రి పువ్వాడ
మద్దులపల్లి మార్కెట్ ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కార్మికులు, వ్యాపారులు, ఖరీదుదారులకు సైతం ప్రయోజనం చేకూరుతుందన్నారు. మద్దులపల్లి మార్కెట్ నిర్మాణంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొంత ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మంచి అభివృద్ధి సాధించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయరంగం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లచట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లు లేకుండా చేయాలని కేంద్ర సర్కార్ ఆలోచన చేసిందన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లను బలోపేతం చేస్తున్నదని తెలిపారు. మార్కెట్ల పాలకవర్గాల్లో రిజర్వేషన్ విధానం తీసుకవచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఖమ్మం ఏఎంసీ చైర్‌పర్సన్‌గా దళిత మహిళకు అవకాశం రావడం అభినందనీయమన్నారు. రైతులు పండించిన పంటను కొనాల్సిన కేంద్ర సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్న సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్ల నష్టమైనప్పటికీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసి, మంచి లాభాలను పొందాలని రైతులకు సూచించారు.
దేశానికే తెలంగాణ ఆదర్శం:ఎంపీ నామా నాగేశ్వరరావు
అభివృద్ధి, సంక్షేమంలో నేడు యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని, ముఖ్యమంత్రి ముందుచూపుతోనే కోతలు లేని విద్యుత్ సరఫరా జరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి
రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని కోరిన వెంటనే మార్కెట్‌కు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రత్యేక కృతతలు తెలిపారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైతులకు సైతం ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఆధునిక మార్కెట్, కోల్డ్స్టోరేజీలని సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 3వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదని, స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి సర్కార్ డబ్బులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ నిర్మాణాన్ని త్వరితగతిన చేసి వచ్చే ఏడాది నాటికి క్రయవిక్రయాలు కొనసాగించాలన్నదే ప్రధాన ధ్యేయమని అన్నారు.
మార్కెట్‌తో బహుళ ప్రయోజనాలు: పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ
మద్దులపల్లి మార్కెట్ నిర్మాణంతో మండల ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కందాళ కృషి అభినందనీయమని కొనియాడారు., మార్కెట్ పూర్తయితే ఈ ప్రాంతాల భూమలకు మంచి ధరలు పలుకుతాయన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: తాతా మధు, ఎమ్మెల్సీ
రైతుల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు, రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో రైతు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ మద్దులపల్లి మార్కెట్ సౌకర్యంగా ఉంటుందని అన్నారు.
భారీగా తరలివచ్చిన రైతులు
మద్దులపల్లి మార్కెట్ శంకుస్థాపన, కృతజ్ఞత సభకు రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల నుంచి రైతులు వేలాదిగా తరలివచ్చారు. వాతావరణం చల్లబడడంతో మహిళలు, వృద్ధులు సైతం సభకు వచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంస్ చైర్మన్ రాయల శేషగిరావు, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌రావు, ఎంపీపీ బెల్లం ఉమావేణుగోపాల్, జడ్పీటీసీ వరప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మద్దులపల్లి చైర్పర్సన్ మల్లీడు అరుణ, పాలకవర్గం సభ్యులు, ఖమ్మం మేయర్ పి.నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి, కూసుమంచి, తిరుమలయపాలెం, నేలకొండపల్లి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మద్దులపల్లి సర్పంచ్ సుభద్ర, మార్కెటింగ్‌శాఖ అధికారులు రాజునాయక్, కోలహలం నాగరాజు, జిల్లా వ్యసాయశాఖ ఇన్చార్జి అధికారి బి.సరిత, ఉద్యానశాఖ అధికారి జి.అనసూయ, డీఆర్డీవో విద్యాచందన, డీసీవో విజయకుమారి, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎంపీడీవో అశోక్, తహసీల్దార్ సుమ, మద్దులపల్లి ఏఎంసీ సెక్రటరీ వీరాంజనేయులు, వర్తకసంఘం అధ్యక్షకార్యదర్శులు చిన్ని కృష్ణారావు, గొడవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రైతు శిక్షణా కేంద్రం ప్రారంభం
వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో భారత కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఎంపీ ల్యాండ్స్ ద్వారా సుమారు రూ.2.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక సదుపాయాలు కలిగిన రైతు శిక్షణా కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రైతులు అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేసుకునేందుకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటిని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. అధునాతన పద్ధతుల్లో పంటలు సాగు చేసేందుకు ఖమ్మం జిల్లా ప్రసిద్ధి అన్నారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరయ్యే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, కలెక్టర్ గౌతమ్, ఐటీడీవో పీవో పోట్రు గౌతమ్, రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, ఏసీపీ సాధనా రష్మీ పెరుమాల్, వైరా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు సూతకాని జైపాల్, ముళ్ళపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, నాగి పాల్గొన్నారు.