
కొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 17 : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండోరోజూ భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పక్షంరోజుల క్రితం విస్తారంగా కురిసిన వర్షాలకు సాగు రైతులు సాగు ప్రారంభించారు. అనంతరం వరుణుడు కనుమరుగు కావడంతో ఒకింత రైతులు ఇబ్బందులకు గురయ్యారు. అల్పపీడనం ప్రభావంతో గడిచిన రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సరాసరి 30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతకాని మండలంలో 104 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బోనకల్ మండలంలో 71.2 మి.మీ, వైరా మండలంలో 82.4 మి.మీ, కూసుమంచి మండలంలో 73.6 మి.మీ, ముదిగొండ మండలంలో 65.5 మి.మీ, నేలకొండపల్లి మండలంలో 44.8 మి.మీ, మిగిలిన మండలాల్లో 20-30 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖమ్మం నగరంలో ఎడతెరిపి లేకుండా 4 గంటలపాటు వర్షం కురిసింది.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో భారీగా వర్షం కురిసింది. జిల్లాలోని చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి. ఇల్లెందులోని మసివాగు, కొత్తగూడెంలోని మొర్రేడు, కారుకొండ, గోధుమ వాగులు ఉధృతంగా ప్రవహించాయి. భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు, పాల్వంచ మండలాల్లో ఉదయం నుంచి 2 గంటలపాటు భారీ వర్షం కురిసింది. జిల్లాలో 184.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం184.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 10.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని పినపాకలో 6.2, దుమ్ముగూడెంలో 40.4 , అశ్వాపురంలో 1.6, గుండాలలో 7.6, ఇల్లెందులో 10.4, టేకులపల్లిలో 18.2, జూలూరుపాడులో 28.4, చండ్రుగొండలో 43.4, కొత్తగూడెంలో 9.2, పాల్వంచలో 1.4, బూర్గంపాడులో 0.8, ములకలపల్లిలో 19.2, దమ్మపేటలో 22.6, అశ్వారావుపేటలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నాట్లు ముమ్మరం.. పెసరకు నష్టం
కురుస్తన్న వర్షాలకు ఆయకట్టు, మైదాన ప్రాంతాల్లో వరినాట్ల ప్రక్రియ ముమ్మరమైంది. చేతికి వచ్చిన పెసర పంటకు నష్టం వాటిల్లుతున్నది. వానకాలం సాగుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2.52 లక్షల ఎకరాల్లో వరి సాగు కావొచ్చని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. నేటి వరకు 1.70లక్షల ఎకరాలలో వరినాట్లు పూర్తి కావొచ్చాయి. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న పత్తిపంటకు వరుణుడు ప్రాణం పోసినైట్లెంది.
17.08 అడుగులకు వైరా రిజర్వాయర్ నీటిమట్టం
వైరా, ఆగస్టు17: వైరా రిజర్వాయర్ నీటిమట్టం 17.08 అడుగులకు చేరుకున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం క్రమేనా పెరుగుతున్నది. మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 17.08 అడుగులకు చేరుకున్నది. మొత్తం నీటిమట్టం 10 అంగుళాలకు పెరిగింది. రిజర్వాయర్ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వరద నీరు ఆశించినస్థాయిలో వైరా రిజర్వాయర్‌లోకి వాగుల ద్వారా రావడం లేదు. ఈ సీజన్లో రెండోసారి వైరా రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రామవరం, ఆగస్టు 17: వర్షం కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జీకేఓసీ, జేవీఆర్ ఓసీలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జీకే ఓసీ మొదటి షిప్టులో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 3వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బొగ్గు రవాణాకు అంతరాయం కలగకుండా అధికారులు యార్డు కోల్‌ను రవాణా చేశారు. ఓసీ క్వారీల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో బయటికి పంపించారు.

గోదావరి@11.6అడుగులు
భద్రాచలం, ఆగస్టు17: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మెల్లగా తగ్గుతున్నది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం గోదావరి ఉధృతి పెరిగినప్పటికీ మంగళవారం మెల్లగా తగ్గుతూ వస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 11.7 అడుగులు ఉన్న గోదావరి సాయంత్రం 7 గంటలకు 11.8 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు 11.8 అడుగులు ఉన్న గోదావరి సాయంత్రం 6 గంటలకు 11.6 అడుగులు ఉంది. అంటే సాయంత్రానికి గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతూ వచ్చింది. వర్షాలు కురుస్తున్నప్పటికీ గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం లేదని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
మత్తడి దుంకుతున్న 562 చెరువులు
రిజర్వాయర్లకు జలకళ
ఖమ్మం ఆగస్టు 17 : ఖమ్మం జిల్లాలోని పలు కుంటలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు, కుంటలు నిండాయి. జిల్లాలోని మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరొచ్చి చేరుతున్నది. దీంతో జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. వేల క్యూసెక్యుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు.
నిండిన చెరువులు
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. చెరువుల సామర్థ్యం పెంపు, కట్టలకు మరమ్మతులు చేయడం, తూములు ఆధునీకరించడం, చెరువులకు వరద వచ్చే కాల్వలను పునరుద్ధరించారు. చిన్నచిన్న వర్షాలు కురిసినా నీరు చెరువులో నిల్వ ఉండేలా చేయడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
పాలేరుకు 10వేల క్యూసెక్కుల వరద
కూసుమంచి, ఆగస్టు 17: పాలేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 24 అడుగులకు చేరింది. వరదనీరు సుమారు 10 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో రెండు రోజులుగా గంటగంటకూ పాలేరు నీటి మట్టం పెరుగుతున్నది. నాలుగు రోజుల క్రితం వరకు పాలేరు నీటిమట్టం 20 అడుగుల ఉండగా.. రెండు రోజులుగా వర్షాలతో క్రమంగా పెరిగి ప్రస్తుతం 24 అడుగులకు చేరుకుంది. నర్సిహులగూడెంవాగు, బురకచర్ల వాగుల నుంచి భారీగా వరద నీరు చేరుతున్నది. కిష్టాపురం నర్సిహులగూడెంల మధ్యన ఉన్న వాగు దాటనియ్యకుండా ప్రవహిస్తూ పాలేరులో చేరుతున్నది. 23 అడుగుల నీటి మట్టం రాగానే ఆటోమేటిక్ గేట్లు వాటంతటవే పడిపోతాయి. ప్రసుత్తం అన్నీ గేట్లు పడిపోయి కిందకు నీరు పోతున్నది.
కిన్నెరసానిలో 403 అడుగులకు నీటిమట్టం
పాల్వంచ రూరల్, ఆగస్టు 17: కిన్నెరసాని రిజర్వాయర్‌లో వరద నీరొచ్చి చేరుతున్నది. ఎగువ ప్రాంతాలైన బయ్యారం, ఇల్లెందు, గుండాల తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి నీరు రిజర్వాయర్‌లో కలుస్తున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా.. 1500 క్యూసెక్కుల నీరొచ్చింది చేరింది. మంగళవారం సాయంత్రం నీటి మట్టం 403 అడుగులకు చేరుకున్నది.