మధిర టౌన్, ఏప్రిల్ 29: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహం వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేసిన తరువాత ఆయన మాట్లాడారు. అనంతరం ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజేశ్, ఎంపీపీ మెండెం లలిత, మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత పాల్గొన్నారు.