భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 27: రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు రాష్ట్ర కుటుంబ, వైద్య, సంక్షేమశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఆయన భద్రాద్రి కలెక్టర్ అనుదీప్‌తో కలిసి పల్స్‌పోలియోను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ పొరుగు దేశాల్లో నమోదవుతున్నాయన్నారు. రెండు చుక్కల వ్యాక్సిన్ చిన్నారులను వైకల్యం నుంచి కాపాడుతుందన్నారు. తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. సోమ, మంగళవారాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్తారన్నారు. వ్యాక్సిన్ తీసుకోని పిల్లలకు అక్కడికక్కడే ఇస్తారన్నారు.
ఎన్ని కరోనా వేవ్‌లు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించి కరోనా రహిత రాష్ట్రంగా చేశారన్నారు. ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. సెకండ్ డోస్ కూడా పూర్తి చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతం కోసం సీఎం కేసీఆర్ కొత్తగూడేనికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వినోద్ పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజ స్థాపనకు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. జిల్లాలో 97,522 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. 925 కేంద్రాలతో పాటు అదనంగా 33 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.