
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27: ఆ పాఠశాలలో అడుగుపెట్టగానే విజ్ఞాన పరిమళాల గుబాళింపు పలుకరిస్తుంది. తరగతి గదుల్లో అడుగడుగునా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించే రంగురంగుల చిత్రాలు దర్శనమిస్తాయి. అదే.. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఉపాధ్యాయుల ఆలోచన, ప్రభుత్వ సహకారంతో ఈ పాఠశాల స్వరూపాన్నే మార్చేసింది. వాల్ ప్రాజెక్ట్‌లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నయాబజార్ పాఠశాలను ఎంపిక చేశారు. తరగతి గదులు విద్యార్థులను ఆకట్టుకునేలా వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలని పాఠశాల హెచ్ఎం గాయత్రి, టీచర్లు సమ్మయ్య, రామన్, ముంతాజ్, వాణి, విజయ్ తమ ఆర్థిక తోడ్పాటు అందించారు.
వాల్ ప్రాజెక్ట్‌లో..
వాల్ ప్రాజెక్ట్ నిధులతోపాటు స్కూల్ టీచర్ల సహాయంతో బడి స్వరూపమే మారింది. విద్యార్థుల్లో జాతీయభావం, ఆరోగ్యం, విజ్ఞానం పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసం కలిగించే చిత్రపటాలతో తరగతి గదులను, పాఠశాల పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. దేశం, రాష్ట్రం, సంస్కృతీ సంప్రదాయాలు, మతసామరస్యం, ఆరోగ్యం, ప్రకృతి, తెలుగుదనం, పచ్చదనాన్ని వివరించే విధంగా చిత్రపటాలు ఏర్పాటు చేశారు. జాతీయ గీతం, ప్రతిజ్ఞ పిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా గోడలపై తెలుగు, ఆంగ్ల పదాలు రాయించారు. పుస్తకాలతో పనిలేకుండానే ప్రాథమిక స్థాయిలో కొంత విజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకునేలా చేశారు. స్కూల్ స్వరూపం మారడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
34లో 26 మంది ఇంగ్లిష్ మీడియమే..
1952లో ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభమైంది. ఎందరో మహామహులు ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగారు. అప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ స్కూల్.. ప్రైవేట్ స్కూళ్ల రాకతో మసకబారింది. తెలంగాణ వచ్చాక మౌలిక వసతులు కల్పించడంతో మళ్లీ వికసిస్తుంది. బోధనలో వైవిద్యం చూపాలన్న లక్ష్యంతో గోడలకు వేసిన బొమ్మల ద్వారా పాఠాలు చెబుతూ నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేట్ నిర్వహణను మరిపిస్తోంది. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతంలో 170 మంది విద్యార్థులుండగా.. ఇప్పుడు 210 మంది విద్యార్థులు ఉన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 34 మంది విద్యార్థులు హాజరు అవుతుండగా వారిలో 26 మంది ఇంగ్లిష్ మీడియం. 8 మంది మాత్రమే తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారు. దీన్ని బట్టి ఇంగ్లిష్ మీడియం పట్ల ఆసక్తి అర్థమవుతోంది.
బొమ్మలతో బోధన..
విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగానే ఆటపాటలతో బోధిస్తూ పిల్లలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సంసిద్ధతా కార్యక్రమాలు చేపడుతూ బోధన కొనసాగిస్తున్నారు. బొమ్మల ద్వారా పాఠాలను బోధిస్తూ ఉపాధ్యాయులు ప్రత్యేకత చాటుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇంకుడుగుంతను సైతం నిర్మించారు.
నాణ్యమైన విద్యాబోధనే ధ్యేయం..
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతున్న నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది. విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన చేస్తూ తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలేకుండా నిర్వహణ సాగిస్తున్నాం. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ పాఠశాలకు మరింతగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం.