రఘునాథపాలెం, ఏప్రిల్ 26: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కేసీఆర్ సర్కార్ ఏటా నిరుపేద ముస్లింలకు అందించే కానుకే ‘రంజాన్ తోఫా’ అని మంత్రి అజయ్ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏటా రంజాన్ తోఫా అందించడం ఆనందంగా ఉందని, కేసీఆర్ సర్కార్ అన్ని మతాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. నగరంలోని నిరుడు 2,500 మందికి రంజాన్ కిట్లు అందించామని, ఈసారి 5,000 కిట్లు అందిస్తున్నామని తెలిపారు. రంజాన్ పండుగను ప్రతి కుటుంబమూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
50 మసీదులకు రూ.50 లక్షల అందజేత
ఖమ్మంలోని 50 మసీదుల మరమ్మతు పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ చెక్కులను మసీదుల సదర్‌లకు మంత్రి అజయ్ మంగళవారం ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఒక్కో మసీదుకి రూ.లక్ష చొప్పున సదర్ల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధు, సీపీ విష్ణు ఎస్ వారియర్లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక నమాజులో మంత్రి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌హసన్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజ, గిర్దావర్ రవికుమార్, టీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు తాజుద్దీన్, పగడాల నాగరాజు, షంషుద్దీన్, ముక్తార్, దేవభక్తుని కిశోర్‌బాబు, షౌకత్ అలీ, నర్రా ఎల్లయ్య, హెచ్చు ప్రసాద్, షేక్ వలీ, బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్, షేక్ రజీం, ఎండీ ఫయాజ్, ఇసాక్, కార్పొరేటర్లు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.