కొత్తగూడెం క్రైం/ మామిళ్లగూడెం, ఏప్రిల్ 25 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. సర్కార్ కొలువుల సాకారానికి ముందడుగు పడింది. తెలంగాణలో ఉద్యోగ జాతర మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేశారు. సర్కార్ కొలువుల భర్తీకి ఒక్కొక్కటిగా ప్రకటనలు విడుదలవుతుం డడంతో నిరుద్యోగులు ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. సోమవారం మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో కలిపి పెద్ద మొత్తంలో పోస్టులను భర్తీ చేయనున్నది.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 2 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించ నున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్షల అనంతరం దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు, చివరి రాత పరీక్ష (ఎఫ్డబ్ల్యూఈ)లకు టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించనున్నది. ఇప్పటికే పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని ఉద్యోగానికి సన్నద్ధం చేస్తున్నారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ తదితర అంశాలపై కసరత్తు చేయిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులు ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారిలో ఆత్మైస్థెర్యం నింపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు తెలిపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఈ నోటిఫికేషన్ వివరాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న ఏడు జోన్ల వారీగా అన్ని విభాగాల ఎస్సైలకు గాను మొత్తం 554 ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులకు గాను 15,644, ఎస్సీటీ పీసీ ఐటీ అండ్ కో మెఖానిక్ లేదా డ్రైవర్ పోస్టులు 383, ఎస్సీటీ ఎస్సై ఐటీ అండ్ కో 33 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.
ఇందులో మొత్తం 16,614 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఉద్యోగాలకు www.tslprb.in ద్వారా ద్వారా వచ్చే నెల 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో ఎస్సై (సివిల్) 414 పోస్టులు, ఆర్ఎస్సై (ఏఆర్) 66, ఎస్సీటీ ఆర్ఎస్సై (టీఎస్ఎస్పీ, పురుషుల విభాగం) 23, ఎస్సీటీ (ఎస్ఏఆర్, పురుషుల విభాగం) 5, ఎస్సై (టీఎస్ఎస్పీ, పురుషుల విభాగం) 12, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26, డిప్యూటీ జైలర్ (పురుషుల విభాగం) 8 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు దాఖలు చేసుకుని ఎంపికైన అభ్యర్థులకు మొదట ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.
అనంతరం దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు, చివరి రాత పరీక్ష (ఎఫ్డబ్యూఈ) టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణనిస్తోంది. పోలీస్ అధికారులు సైతం నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని పోలీస్ నోటిఫికేషన్‌కు కసరత్తు చేసేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టి వారికి ఉచిత శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నారు.
అంతే కాకుండా దేహదారుఢ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు అభ్యర్థులు కసరత్తు చేసేలా పోలీస్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి వ్యాయామ కసరత్తు చేసేలా అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. తాజాగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్‌తో నిరుద్యోగుల్లో ఆనందోత్సహాలు వెల్లివిస్తున్నాయి.
నిరుద్యోగుల మోమెల్లో చిరునవ్వులు..
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడంతో ఉమ్మడి జిల్లా నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులంతా ప్రస్తుతం ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు స్థానిక శిక్షణ కేంద్రాల్లో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సరిళ్ల ద్వారా ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు శిక్షణ అందించే ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లా నుంచి సుమారు 25 వేల మందికి పైగా నిరుద్యోగ యువత ఈ సారి ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంది.
ప్రణాళికతో విజయం సాధ్యమే..
ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు. ప్రభుత్వం చెప్పిన విధంగా నోటిఫికేషన్ వెలువడినందున విద్యార్థులు ఎకువ సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అయితే కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించిన విద్యార్థుల్లో సహజంగా కొంచెం ఒత్తిడి నెలకొంటుంది. ప్రణాళికాబద్ధంగా సిలబస్‌ను అధ్యయనం చేయడం ద్వారా దీనిని అధిగమించొచ్చు. అర్థమెటిక్, రీజనింగ్, తెలంగాణా ఉద్యమ చరిత్ర, హిస్టరీ, జాగ్రఫీ వంటి వాటిల్లో ఎకువ మారులు వచ్చే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలి. ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో నెగిటివ్ మారింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఐదు తప్పు ప్రశ్నలకు ఒక మారును తగ్గిస్తారు. కాబట్టి వీలైనన్ని ఎకువ మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎకువ మారులు సాధించే అవకాశం ఉంది.
– మెండెం కిరణ్ కుమార్, రైట్ చాయిస్ అకాడమీ, ఖమ్మం
నోటిఫికేషన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది..
మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా.. ప్రస్తుతం భారీ స్థాయిలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడటంతో చాలా ఆనందంగా ఉంది. ఖమ్మంలోని రైట్ చాయిస్ అకాడమీలో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్నా. ఈసారి ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించి తీరతాననే నమ్మకం నాకు ఉంది.
– శిరీష, సత్తుపల్లి
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా భారీ స్థాయిలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నిరుద్యోగులకు ఎలాంటి లోటు లేకుండా జిల్లా స్థాయి. పోస్టులను స్థానికులకే వచ్చేలా చట్టాలు రూపొందించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాలాంటి నిరుద్యోగులకు పరీక్షకు సన్నద్ధమవ్వడానికి కూడా తగిన సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
– యామాల ప్రీతి, బోనకల్లు