భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి రాష్ట్రంలోని పూర్తి ఏజెన్సీ జిల్లాల్లో ఒకటి. ఇక్కడ నిరుపేదలే ఎక్కువ. వారి కుటుంబాల్లోని పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించడం కష్టతరం. ఈ నేపథ్యంలో ‘పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి..’ అనే లక్ష్యంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు మిల్లెట్ (చిరుధాన్యాల) ఆహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా అశ్వారావుపేట, పాల్వంచ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వంద సెంటర్లను ఎంపిక చేశారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో బలవర్థక ఆహారం అందిస్తున్న జిల్లాగా పేర్గాంచిన భద్రాద్రి జిల్లా మరో ప్రాజెక్టును సొంతం చేసుకుంది.
ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ‘ఆరోగ్య లక్ష్మి’ భోజనం అందిస్తున్నప్పటికీ అదనంగా వారంలో రెండు రోజుల పాటు 150 గ్రాముల చొప్పున మిల్లెట్ ఆహారం (కొర్రలు, జొన్నలు, పల్లీలు) అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు పిల్లలకు రాగి లడ్డూలూ అందనున్నాయి. లడ్డూల తయారీకి అశ్వారావుపేటలోని ఓ యూనిట్‌తో కాంట్రాక్ట్ సైతం కుదిరింది. మల్టీ గ్రెయిన్ మిల్లెట్ తయారీకి భద్రాచలంలోని ఐటీడీఏ యూనిట్ నుంచి సామగ్రి తీసుకోనున్నది.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కలెక్టర్ అనుదీప్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఆకాంక్ష జిల్లాల్లో భాగంగా ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయి. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాలో ముందుగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ తలంచారు. జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆధారపడి ఎక్కువగా గిరిజన కుటుంబాలే ఉన్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో పక్కాగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది నుంచి గిరిజన ప్రాంతాల్లో రైతులకు మిల్లెట్ సాగు చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు 54 క్వింటాళ్ల మిల్లెట్ విత్తనాలను ఉచితంగా అందజేశారు. జిల్లాలో ఇప్పటికే 1,120 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
గిరిజన ప్రాంత పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ‘ఆకాంక్ష జిల్లా’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించారు. నీతి ఆయోగ్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రాద్రి జిల్లాలోనే మొదటిసారిగా ఈ కార్యక్రమం అమలవుతున్నది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, కేంద్రాల పరిధిలోని తల్లులు, గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించాం.
– రాయపూడి వరలక్ష్మి, జిల్లా
సంక్షేమశాఖ అధికారిణి, కొత్తగూడెం