మణుగూరు రూరల్, ఏప్రిల్ 23: చుట్టూ అందమైన అడవి.. ఎత్తైన గుట్టలు, కొండల నడుమ నుంచి భూమిని ముద్దాడాలని పరుగులు పెట్టే వెన్నెల జలపాతం. నీటి ఒరవడి కింద సేద దీరుతూ పర్యాటకులు.. ఆ ప్రాంతం ఎక్కడుంది అనుకుంటున్నారా..? మణుగూరుకు కూతవేటు దూరంలో రథంగుట్ట వద్ద ఉన్నది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ కృషి చేస్తున్నది. పర్యాటకుల సౌకర్యార్థం వాష్‌రూం, పగోడాలు నిర్మించనున్నది. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నది. ఏటా వానకాలంలో జలపాతం ఆకర్షిస్తున్న నేపథ్యంలో పర్యాటకుల రద్దీకి అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నది. పర్యాటకులు, మహిళలు, చిన్నారులు అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతుండడాన్ని గుర్తించి వారికి వసతులు కల్పిస్తున్నది. కేవలం వానకాలంలోనే కాక అన్ని కాలాల్లోనూ జలపాతం కిందికి వచ్చే విధంగా కృత్రిమ ఏర్పాట్లు చేయనున్నది. గుట్టపై రిసార్ట్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అటవీ అధికారులకు సూచించారు.
మొక్కల పెంపకానికి ప్రాధాన్యం..
జలపాతం సమీపప్రాంతంలో అర్బన్ పార్కు నిర్మిస్తుండడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానకాలంలో జలపాతం వద్దకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రథంగుట్ట సమీపంలో అటవీశాఖ రూ.80 లక్షల వ్యయంతో సుమారు 2.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, వాష్ రూంలు, వన్యప్రాణుల కోసం నీటి గుంతలు, టవర్ వాచ్ నిర్మిస్తున్నది. 44 సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నది. అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నది. జలపాతం వెళ్లే ప్రాంతంలో ప్రధాన ద్వారం నిర్మించనున్నది. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా అర్బన్ పార్కులో యాదాద్రి మోడల్ (మీటర్ మీటర్‌కు మధ్య మొక్క)లో ఇప్పటికే 8 వేల మొక్కలు పెంచుతున్నది.
సుందరంగా తీర్చిదిద్దుతాం..
వాకింగ్ ట్రాక్ చుట్టూ ఎడ్జ్ ప్లాంట్లు, గ్రీనరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. సర్కిల్ కన్జర్వేటర్ భీమా, డీఎఫ్‌వో లక్ష్మణ్ రంజిత్‌నాయక్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు పనులను రేంజ్ ఆఫీసర్ ద్వాలియా సూచనలిస్తున్నారు. అర్బన్ పార్క్‌లో చిల్డ్రన్ పార్క్, అడ్వెంచర్ పార్క్, సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తాం. బెంచీలు, కుర్చీలు, జంతువుల బొమ్మల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
-మంజుల, ఎఫ్‌డీవో, మణుగూరు