ఖమ్మం, ఏప్రిల్ 22: ‘రేణుకా ఖబడ్దార్..’ అంటూ కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిని టీఆర్ఎస్ మహిళా నేతలు హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని గిరిజనుడి దగ్గర రూ.కోట్లు వసూలు చేసిన చరిత్ర మీదని, అతడి చావుకు కారకురాలూ మీరేనన్న విషయం ఖమ్మం ప్రజలకు తెలుసని అన్నారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న మీరు.. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్పైనా, ఆయన సతీమణిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తాము సహించబోమని స్పష్టం చేశారు.
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంపైనా, యాదాద్రి ఆలయానికి బంగారం సమర్పించిన అంశంపైనా మంత్రి అజయ్ దంపతులపై రేణుకాచౌదరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మహిళా నేతలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ.. జిల్లాను ఏనాడూ అభివృద్ధి చేయని రేణుకాచౌదరి.. ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. యాదాద్రికి జిల్లా ప్రజల తరఫున మంత్రి అజయ్ దంపతులు కిలో బంగారాన్ని సమర్పిస్తే.. దానిని రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రి సతీమణిని రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా, టీఆర్ఎస్ మహిళా విభాగం నేత బాణోత్ ప్రమీల, సుడా డైరెక్టర్ కొల్లు పద్మ విమర్శించారు. విజయవాడ, ఖమ్మానికి చెందిన రౌడీలను చెరో వైపు నించోబెట్టుకొని మాట్లాడుతున్న రేణుకాచౌదరి.. తాను ఎంత నిజాయితీపరురాలో తెలుసుకోవాలని గుర్తుచేశారు. వైరా టికెట్ ఇప్పిస్తానని డాక్టర్ రాంజీ దగ్గర రూ.కోట్లు తీసుకొని అతడి చావుకు కారణమైన రేణుకాచౌదరి.. మంత్రిపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. కూతురు, అల్లుడితో హైదరాబాద్‌లో అక్రమంగా పబ్‌లు నడిపిస్తున్న చరిత్ర మీది కాదా? అంటూ ప్రశ్నించారు. సాయి గణేశ్ ఆత్మహత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని పబ్బం గడుపుకోవాలని చూడడం సిగ్గుచేటన్నారు. కార్పొరేటర్లు పాలెపు విజయ, కొత్తపల్లి నీరజ, రుద్రగాని శ్రీదేవి, రావూరి కరుణ, ధనాల రాధ, మోతారపు శ్రావణి, సరిపూడి రమాదేవి, పాకాలపాటి విజయనిర్మల, దోన్వాన్ సరస్వతి, పైడిపల్లి రోహిణి, మందడపు లక్ష్మి, ప్రశాంతలక్ష్మి, ఆళ్ల నిరిశా రెడ్డి, చిరుమామిళ్ల లక్ష్మి, పగడాల శ్రీవిద్య, దాదె అమృతమ్మ, తోట ఉమారాణి, షకీనా, గజ్జల లక్ష్మి పాల్గొన్నారు.
మంత్రి అజయ్, ఆయన సతీమణి వసంతలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుకాచౌదరి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ మహిళా నేతలు దహనం చేశారు. తొలుత మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు శవయాత్ర నిర్వహించారు.