భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పంట పండించామా.. పని అయిపోయిందా.. డబ్బులు చేతికొచ్చాయా.. పూట గడిచిందా.. అన్న కోణంలో ఆలోచించి వేసవి దుక్కులను నిర్లక్ష్యం చేస్తే రానున్న సీజన్లో పంటలు సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవి దుక్కులు తప్పనిసరి. ఎక్కువ మంది రైతులు వేసవి దుక్కులు దున్నిస్తారు కానీ ఏ సమయంలో దున్నిస్తున్నామనే అంశాన్ని పట్టించుకోరు. తొలకరి జల్లులు కురిశాక దున్నిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. వేసవిలో దున్నితేనే పంటలకు మేలు జరుగుతుంది.
పత్తి, జొన్న, మిర్చి, కంది, పెసర, వేరుశనగ పంటలు వేసిన రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు వేయాల్సిందే. అలాగే వదిలేస్తే వర్షాలు పడినప్పుడు నీరు భూమిలోకి ఇంకదు. ఎండిపోయిన చెట్ల బెరడులు నీటిని పీలుస్తాయి. దీంతో భూసారం తగ్గిపోతుంది. వేసవి దుక్కులు దున్ని పంటలను ఆశించే చీడపీడలకు చెక్ పెట్టవచ్చు. పంట కోత దశలో బెరడు, మోడు మధ్యలో పురుగులు నిద్రావస్థలో ఉంటాయి. ఇదే సమయంలో దుక్కులు దున్నితే నిద్రలో ఉన్న క్రిమికిటకాల జాతి అంతమవుతుంది. దుక్కుల కారణంగా తొలకరిలో పంటలు సాగు చేసినప్పుడు పంటను పురుగు ఆశించకుండా ఉంటుంది. దుక్కుల సమయంలో బయటపడిన పురుగుల అవశేషాలు, గుడ్లను పక్షులు ఆహారంగా తీసుకుంటాయి. దీంతో చీడపీడల నివారణ సాధ్యమవుతుంది. అంతేకాకుండా పంటలో కలుపు తక్కువగా వస్తుంది.
రైతులు వేసవి వెళ్లక ముందే లోతైన దుక్కులు దున్నాలి. పొలానికి అడ్డంగా దున్నడంతో భూమిలోని చీడ పురుగులు నశించిపోతాయి. తగినంత తేమ ఉన్నప్పుడు దుక్కులు వాలుగా లోతుగా దున్నితే నేల కోతకు గురవకుండా ఉంటుంది. దున్నిన తర్వాత రైతులు పంటల సాగుకు వేపగింజల మిశ్రమాన్ని చేలో పిచికారీ చేయాలి. దీంతో క్రిమి కీటకాలు పంటను ఆశించవు. క్రిమి సంహారక మందులు వాడకుండా ఉండడమే మంచిదని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.
వేసవి దుక్కులు నేల స్వభావాన్ని మార్చివేస్తాయి. భూసారాన్ని కాపాడతాయి. వాలుకు అడ్డంగా దున్నడంతో వర్షం కురిసినప్పుడు భూమిలోని సారం ఇంకుతుంది. భూమిలోనే నిల్వ ఉంటుంది. రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే వేసవి దుక్కులు దున్నాలి. ఇప్పటికే సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కొర్సా అభిమన్యుడు, డీఏవో, కొత్తగూడెం