ఖమ్మం, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన వెంటనే ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో గురువారం తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. రఘునాథపాలెం మండలంలో యాసంగి విరివిగా పండిందని, రైతులకు ఇబ్బంది కలగకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
ఖమ్మం జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో యా సంగి వరిసాగు చేశారు. సుమారు 2.42 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రాలను శుక్రవారం నుం చి ప్రారంభించేలా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అవసరమైన గన్నీబ్యాగులు, కాంటాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కనీస మద్దతు ధర కు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఏర్పా ట్లు చేశారు. ధాన్యం విక్రయించినట్లు ప్రభుత్వ రికార్డులో నమోదైన తక్షణమే నగదు జమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోతలు ప్రారంభం, ధాన్యం దిగుబడిఆధారంగా జిల్లాలో వివిధ ప్రాం తాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ, ప్రాథమిక సహకార, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.