ఖమ్మం, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నగరంలో ఈ నెల 16న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు. గురువారం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరానికి పూర్తిస్థాయి అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సాయంత్రం 5 గంటలకు లకారం ట్యాంక్‌బండ్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తోపాటు పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు.
ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా ఖమ్మం చేరుకుంటారని, సాయంత్రం 6గంటల వరకు జిల్లా కేంద్రంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. నగర ప్రజల కోసం ఆధునిక హంగులతో నిర్మించిన మున్సిపల్ భవనం, రఘునాథపాలెం మండలంలో బృహత్ పల్లెప్రకృతి వనం, మినీ ట్యాంక్‌బండ్‌ను మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. లకారం ట్యాంక్‌బండ్‌లోని సస్పెన్షన్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటేన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. నగర అభివృద్ధిని చూసి విదేశాల్లో ఉన్న జిల్లావాసులు ఆశ్చర్యపోతున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ అధ్యక్షుడు కమర్తపు మురళీ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.