భద్రాచలం, ఏప్రిల్ 11: కల్యాణ రాముడు.. పట్టాభిరాముడయ్యాడు.. రాజ్య పాలకుడయ్యాడు.. జగత్కల్యాణానికి కారణభూతుడ య్యాడు.. మంగళవాయిద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా వేద మంత్రాల నడుమ రాజదండం చేతబట్టాడు.. సింహాసనాన్ని అధిష్ఠించాడు.. ఈ అపురూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది.. ఆదివారం కల్యాణ మహోత్సవం జరిగిన చోటే సోమవారం కనుల పండువగా శ్రీరాముని పట్టాభిషేకం జరిగింది. గవర్నర్ తమిళిసై స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆమెకు ఆలయ ఈవో బానోత్ శివాజీ స్వాగతం పలికారు.
మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రాల నడుమ రాజదండం చేత బట్టి భద్రాద్రి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు.. ‘రాజాధిరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది. ఆదివారం కల్యాణ మహోత్సవం జరిగిన చోటే సోమవారం కనుల పండువగా శ్రీరాముని పట్టాభిషేకం జరిగింది. తొలుత అర్చకులు రాజ లాంఛనాలతో పవిత్ర గోదావరి నుంచి తీర్థ జలాలను తీసుకువచ్చారు. రామాలయంలోని భద్రుని కోవెలలో స్వామివారి పాదుకలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం సిబ్బంది పల్లకీలో ఉత్సవ మూర్తిని స్టేడియానికి తీసుకొచ్చారు. వాగ్గేయకారుడు భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను స్వామివారికి అలంకరించారు. చతుఃస్థానార్చన, విశ్వక్సేన, పుండరీకాక్ష నామస్మరణ, అష్టోత్తర నామార్చన, సహస్ర నామార్చన, సువర్ణ పుష్పార్చన, హోమం చేపట్టారు.
పంచ నదుల తీర్థ జలాలతో ప్రోక్షణ చేసి ఆ తీర్థాన్ని అష్టదిక్కుల్లో చల్లారు. పట్టాభిషేక ప్రాశస్త్యాన్ని వివరించారు. రాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలన్నారు. జగతిలో ఏ దేవుడికి జరపని పట్టాభిషేకం ఒక్క భద్రాద్రి రామయ్యకే సొంతమని ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి తెలిపారు. ఆలయ సన్నిధిలో 60 ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుందని, ఇలా 2011లో జరిగిందన్నారు. 2023లో పుష్కర పట్టాభిషేకం జరుగుతున్నదన్నారు. ఆభరణాలైన బంగారు పాదుకలు, స్వర్ణ ఛత్రం, ముద్రిక, రాజదండం, డాలు, ఖడ్గం, కిరీట ధారణ గావించారు. గవర్నర్ తమిళిసై స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆమెకు ఆలయ ఈవో బానోతు శివాజీ మర్యాదలతో స్వాగతం పలికారు.
గవర్నర్‌కు స్వాగతం..
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వేస్టేషన్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసైకి అదనపు లెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏఎస్పీ ప్రసాదరావు, భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్, ఆర్డీవో స్వర్ణలత, సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం, జీఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్సీ బసవయ్య, జీఎం సెక్యూరిటీ హనుమంతరావు, జీఎం సివిల్ రమేశ్‌బాబు, డీజీఎం పర్సనల్ ధన్పాల్ శ్రీనివాస్, డీజీఎం సివిల్ రాజశేఖర్ స్వాగతం పలికారు.