ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) ప్రతినిధి: యాదాద్రి తరహాలో భద్రాద్రి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం రూ.150 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. భద్రాచలంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ఆదివారం మీడియాతో మాట్లాడారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకు గాను ఇప్పటికే రూ.100 కోట్లు ప్రకటించామని, ప్రసాద్ పథకం కింద మరో రూ.50 కోట్లు మంజూరు చేశామని వివరించారు.
భద్రాద్రి, వేములవాడ, బాసర దేవాలయాలను కూడా యాదాద్రి తరహాలోనే అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా భద్రాచలం దేవస్థానంలో సీతారామ కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి ప్రసాదాలు, తలంబ్రాలకు తొక్కిసలాట జరుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, బస్టాండ్లతోపాటు భద్రాచలంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ప్రసాదం, తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు.
కరోనా నుంచి తేరుకున్న ప్రజలు: వైవీ.సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్
రెండేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలను కలవరపర్చిన కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో సీతారామ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం భద్రాచలంలో జరిగిన శ్రీసీతారామ కల్యాణ మహోత్సవంలో సుబ్బారెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి, సీతమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి కల్యాణానికి అశేష సంఖ్యలో భక్తులు రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయశాఖ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
భద్రాద్రిపై ప్రత్యేక దృష్టి:మంత్రి సత్యవతి
దేవాలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు, భక్తులకు ఎలాంటి లోటు రాకుండా సకల సౌకర్యాలు కల్పించినందుకు దేవస్థానం అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు తెలిపారు.