ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) ప్రతినిధి: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళన చేసిన టీఆర్ఎస్ శ్రేణులు.. తమ పోరాటాన్ని ఢిల్లీలో చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం దేశ రాజధానిలో ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. భద్రాచలంలో సీతారామ కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు ఖమ్మం నియోజకవర్గానికి చెందిన అనేకమంది ప్రజాప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు.
అలాగే టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ భద్రాచలంలో కల్యాణ మహోత్సవం పూర్తికాగానే ఢిల్లీకి బయలుదేరారు. టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లెందు, వైరా, పాలేరు, కొత్తగూడెం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, టీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు.