ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) ప్రతినిధి: వసంతపక్ష తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామికి మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దేవస్థానం అధికారులు సకల ఏర్పాట్లు పూర్తిచేశారు. సీతారామ కల్యాణ మహోత్సవం జరిగిన మరునాడు అదే మిథిలా స్టేడియంలో భక్తుల సమక్షంలో శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం రామాలయం ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చతుస్నానార్చన హోమం నిర్వహించనున్నారు. అనంతరం మిథిలా స్టేడియానికి ఊరేగింపుగా తీసుకొచ్చి పట్టాభిషేక మహోత్సవ వేదికపై స్వామివారిని ఆశీనులను చేస్తారు. అనంతరం సకల విఘ్నాలు తొలగిపోయే విధంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహిస్తారు. కల్యాణ మహోత్సవం ముగిసినా స్వామివారి మహా పట్టాభిషేకాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీరామమహా పట్టాభిషేకంలో గవర్నర్ తమిళి సై పాల్గొననున్నారు. సోమవారం తెల్లవారుజాముకే ఆమె కొత్తగూడెం చేరుకుంటారు. సోమవారం ఉదయం 9 గంటలకు భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మిథిలా స్టేడియం జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వామివారికి, సీతమ్మ తల్లికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
నేడు, రేపు జిల్లాలో గవర్నర్ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 10: గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలోని సరస్వతి శిశుమందిర్‌కు చేరుకుంటారు. అనంతరం వనవాసి కల్యాణ పరిషత్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 12న ఉదయం 9:30 గంటలకు దమ్మపేట మండలం పూసుకుంట గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పనులను కలెక్టర్‌తో కలిసి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పూసుకుంట నుంచి బయల్దేరి తిరిగి ఇల్లెందు గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని హెవీ వాటర్‌ప్లాంట్‌ను సందర్శిస్తారు. రాత్రి 10:30 గంటలకు కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే రైలులో బయలుదేరుతారు.