బొలేరో రూపంలో వచ్చిన మృత్యువు
గోడపెళ్లలు, స్తంభం పడి ఇద్దరు చిన్నారులు మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
కొణిజర్ల, ఏప్రిల్ 10: ప్రహరీ పక్కన ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల (తోబుట్టువులు) ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం వారి ఊసురు తీసింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మండలంలోని పల్లిపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులతోపాటు సుమారు 25 మంది భజన బృందంగా ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో నవమి వేడుకకు హాజరయ్యారు. వారితోపాటుగా వారి కుమార్తెలు పగడాల సహస్త్ర(7), పగడాల దేవిప్య(9)ను వెంట తీసుకొచ్చారు.
రాత్రి సమయంలో భజన నిర్వహిస్తుండగా పిల్లలు గోడపక్కనే ఆడుకుంటున్నారు. ఖమ్మం నుంచి దిద్దుపూడి వెళ్తున్న బొలేరో వాహనం అతివేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని, దాని పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడపెళ్లలు, స్తంభం విరిగిపడడంతో తోబుట్టువులిద్దరితోపాటు మరో చిన్నారి ఇజ్జగాని అలేఖ్య, బొలేరో వాహనం నడుపుతున్న నాగటి వెంకన్న, మక్కల పోతురాజు తీవ్రగాయాలపాలయ్యారు. ఖమ్మం తరలిస్తుండగా సహస్త్ర, దేవిప్య మృతిచెందారు. వెంకన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు.