చర్ల, ఏప్రిల్ 9: ఏజెన్సీ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని, ఈప్రాంత అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తానని హైకోర్టు జడ్జి సుధీర్‌కుమార్ అన్నారు. హైకోర్టు జడ్జిగా నియమితులైన ఆయన తొలిసారిగా స్వస్థలానికి వచ్చిన సందర్భంగా శనివారం పలువురు సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను రిటైర్డ్ అయిన తర్వాత చర్లలోనే ఇల్లు నిర్మిస్తానని, శేష జీవితాన్ని చర్లలో గడుపుతానని అన్నారు. ఇక్కడే ఉండి ఈ ప్రాంతవాసులకు సాయం అందిస్తానన్నారు. న్యాయపరంగా సేవలు అందిస్తానన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలో పుట్టి హైకోర్టు జడ్జిగా ఎదగడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎమ్కార్కే చౌదరి, హైదరాబాద్ కేర్ హాస్పిటల్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ డీఎన్ కుమార్ పాల్గొన్నారు.