భద్రాచలం, ఏప్రిల్ 8 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో విఘ్నాలు చోటుచేసుకోకుండా, ఆలయానికి రక్షణగా ఉండేందుకు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటాన్ని గరుడాధివాసం నుంచి తీసుకొని వచ్చి పూజలు చేశారు. అనంతరం ధ్వజారోహణం చేశారు. ఆలయంలో ఉదయం తిరువారాధన, సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, తీర్థ, ప్రసాద వినియోగం జరిపారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్న నాశకుడైన విశ్వక్సేన ఆరాధన, కర్మణః ఫుణ్యాహవాచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన, తోరణ ఆరాధన చేశారు. నవాహ్నిక దీక్షకు అగ్నిమథనం చేసి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన, హోమం నిర్వహించారు. శనివారం నుంచి పౌర్ణమి వరకు(16వ తేదీ వరకు) నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంకేతంగా అటు దేవతలు, ఇటు మానవులకు తెలిపేలా గరుడపటాన్ని ధ్వజారోహణం చేస్తారు. అష్ట దిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలను ఆహ్వానించే భేరీ పూజలను నేత్రపర్వంగా జరిపారు.
ధ్వజపటానికి ప్రత్యేక పూజలు
ముందుగా ప్రధాన ఆలయం నుంచి వేద పండితులు మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు నడుమ సమస్త రాజలాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవమూర్తులను ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి, ధ్వజస్తంభం వద్దకు తోడ్కోని వచ్చారు. అనంతరం గరుడ పటంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, బ్రహ్మోత్సవాల రక్షణ కోసం గరుత్మంతుడిని ఆహ్వానించి ఆరాధన జరిపారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను, అర్చకులు పఠించారు. మేళతాళాలు, వేదమంత్రాల నడుమ గరడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. అనంతరం బలిహరణం జరిపారు. సంతానం లేని మహిళలకు గరుడ ముద్దలను అర్చకులు పంపిణీ చేశారు.
ఈ ముద్దను తీసుకున్న వారికి ఉదరంలో ఉన్న వ్యాధులు పోయి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. అష్టదిక్పాలకులు, 33కోట్ల దేవతలను ఆహ్వానించి, 16రకాల వాయిద్యాలకు షోడశోపచార పూజ నిర్వహించి, వాయిద్యకారులను సత్కరించారు. అనంతరం భేరీ మోగించారు. ఉత్సవమూర్తులతోపాటు అష్ట దిక్పాలకులకు బలిహరణం జరిపారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బానోత్ శివాజీ దంపతులు, ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధానార్చకుడు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం, అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకుడు అమరవాది మధుసూదనాచార్యులు, అమరవాది మురళీకృష్ణమచార్యులు, ఇతర అర్చకులు పాల్గొన్నారు.
నేడు ఎదుర్కోలు ఉత్సవం
నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం భద్రాద్రి రామయ్యకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఉదయం చతుఃష్టానార్చన జరుపుతారు. ప్రతి ఏడాది ఉత్తర ద్వారం ఎదుట ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉత్తర ద్వారం ఎదుట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం, 11న మహా పట్టాభిషేకం జరుపనున్నారు.