మామిళ్లగూడెం, ఏప్రిల్ 8: రూ.75లక్షల విలువైన 225 కేజీల ఎండు గంజాయిని ఖమ్మం టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లు, లారీ, 7.20లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనపర్చుకున్నారు. ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి ఖమ్మం జిల్లా మీదుగా రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. రాజస్థాన్‌కు తరలించేందుకని నగరంలోని బుర్హాన్‌పురం సమీపంలో ఖాళీ ప్రదేశంలో ట్రాక్టర్ కింది భాగంలో గంజాయిని నిందితులు దాచారు. దానిని లారీలోకి లోడ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామస్తుడు కొత్తపల్లి రాజు అలియాస్ బానోత్ రాజు, రాజస్థాన్ రాష్ట్రంలోని మండి జిల్లా బంజారకాకెడ గ్రామస్తులు బంజార గోరులాల్, బంజార మిత్తులాల్, బంజార బాబులాల్ ఉన్నారు. ఈ ముఠా సభ్యుడైన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అమ్ముతండా గ్రామస్తుడు గుగులోత్ బాబులాల్ పరారీలో ఉన్నాడు. వీరంతా కలిసి ఒడిశా నుంచి పొడి గంజాయి తీసుకొచ్చి, ఖమ్మం బుర్హాన్‌పురంలో ట్రాక్టర్ కింది భాగంలో నిల్వ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున, ట్రాక్టర్ నుంచి లారీలోకి లోడ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.75లక్షల విలువైన 225 కిలోల ఎండు గంజాయితోపాటు రూ.7.20లక్షల నగదు, రెండు ట్రాక్టర్లు, లారీని స్వాధీనపర్చుకున్నారు.
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నట్లు సీపీ చెప్పారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల క్రయ విక్రయదారులతోపాటు రవాణా చేస్తున్న, వినియోగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే 12 మంది నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా మీదుగా గంజాయి రవాణాను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీగా గంజాయిని పట్టుకున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. వారికి క్యాష్ అవార్డుతోపాటు రివార్డులను అందిస్తున్నామన్నారు. అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు, టూ టౌన్ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐలు మల్లయ్య స్వామి, నవీన్ పాల్గొన్నారు.