ఖమ్మం, ఏప్రిల్ 8 : ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మరో చారిత్రాత్మక పోరాటాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన దశలవారీ ఆందోళనలో భాగంగా శుక్రవారం టీఆర్ఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మోటర్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి తన కుమారుడు నయన్రాజ్తో కలిసి పాల్గొన్నారు. నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్, జడ్పీ సెంటర్, చర్చికాంపౌండ్ సెంటర్, గ్రెయిన్ మార్కెట్, గాంధీచౌక్, పీఎస్ఆర్ రోడ్, మయూరి సెంటర్, వైరా రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, బైపాస్ రోడ్ నుంచి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
అనంతరం పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి భేషరతుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, రైతుబంధు ద్వారా పెట్టుబడితో రైతులు పంటలు పండించుకుంటుంటే పండిన పంటను కొనుగోలు చేయకుండా ప్రధాని మోదీ తిరకాసు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే రైతులు ఆనందంగా ఉంటున్న సమయంలో కేంద్రం పిడుగులాంటి నిర్ణయం తీసుకుందని, దీంతో రైతుల భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళనలో సీఎం కేసీఆర్ ఉద్యమబాట పట్టారని తెలిపారు.
దేశానికి అన్నం పెడుతున్న రైతుల పక్షాన నిలబడి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 11వ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులుh కమర్తపు మురళి, బొమ్మెర రామ్మూర్తి, మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవభక్తిని కిశోర్, నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్, ఉపాధ్యక్షుడు బలుసు మురళీకృష్ణ, కొల్లు పద్మ, షకీనా, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.