మామిళ్లగూడెం, ఏప్రిల్ 8 : చింతకాని మండలంలోని దళితబంధు లబ్ధిదారుల ఖాతాలకు 28 కోట్ల రూపాయలు జమ చేశామని, లబ్ధిదారులు యూనిట్లు గ్రౌండింగ్ ప్రారంభించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ గ్రామ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజా సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ చింతకాని మండలంలోని 26 గ్రామాల్లో ఇప్పటివరకు 1,873 మందికి 1 లక్షా 50వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఈ డబ్బులతో లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల గ్రౌండింగ్‌కు గ్రామ ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. సూచించారు. అనుభవం కలిగిన రంగాల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేసుకునే విధంగా లబ్ధిదారులకు సూచించి, గ్రౌండింగ్ ప్రారంభించాలన్నారు.
కిరాణా, దుస్తుల షాపు, ఫ్యాన్సీ స్టోర్స్ రంగాల్లో అనుభవం ఉన్నవారికి వెంటనే గ్రౌండింగ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. పశువుల కొనుగోలు, పశుగ్రాసం పెంపకం, పాల ఉత్పత్తుల విక్రయాలు, రవాణా రంగం, కిరాణా దుకాణాలు, రిటైల్ అవుట్‌లెట్స్, హర్వేస్టర్స్ తదితర యూనిట్ల గ్రౌండింగ్‌పై విధి విధానాలను నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సత్యనారాయణ, గ్రామ ప్రత్యేక అధికారులు, సెక్టార్ గ్రౌండింగ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.