భద్రాచలం, ఏప్రిల్ 6: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణం బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. ఉదయం 8 గంటలకు పవిత్ర గోదావరి మధ్యలో నుంచి అర్చకస్వాములు తీర్థపు బిందెలతో పుణ్యజలాన్ని తీసుకొని వచ్చారు. ఉదయం 9:05 గంటలకు ఉత్సవమూర్తులను బేడా మండపంలోని ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, రక్షాబంధన, పరిషద్రక్షణ దీక్షా కవచధారణ తదితర పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి రోజున స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య, బ్రహ్మ, రుత్విక్లకు ఆలయ ఈవో బానోత్ శివాజీ దంపతులు దీక్షా వస్ర్తాలను అందజేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు పంచామృతాలు, 9 రకాల పళ్ల రసాలు, హరిద్రాచూర్ణంతో, గంధోదకాలతో, సహస్రధారలతో విశేష స్నపనం జరిపారు.
పంచ ఉపనిషత్తులను పఠిస్తూ.. కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, వేదమంత్రాల నడుమ అంతరాలయంలోని మూలమూర్తుల వద్దకు చేరి భగవత్ విజ్ఞాపన చేశారు. సాయంత్రం 4 గంటలకు యాగశాలతో మత్సంగ్రహణం (పుట్టమన్నుతో పూజ) నిర్వహించారు. అంతకుముందు పుట్టమన్ను కోసం రాజాధిరాజ వాహనంపై శ్రీరాముడు బయలుదేరాడు. పుట్టమన్నును తెచ్చేందుకు గడ్డపారతో రెండో వాహనం బయలుదేరింది. విశ్వక్సేనుల వారితో సైన్యాధిపతి హనుమంతుడు మూడో వాహనంపై, గరుత్మంతుడు నాలుగో వాహనంపై బయలుదేరారు. వారంతా తాతగుడి సెంటర్ వద్ద ఉన్న శ్రీగోవింద రాజ స్వామివారి ఆలయానికి వెళ్లారు. అక్కడ పుట్టమన్నుకు పూజ చేశారు. పుణ్య జలాలతో దానిని ప్రోక్షించారు.
దానిపై భూ వరాహాన్ని ఆచార్యుడు చిత్రీకరించి, న్యాస ధ్యానాదులతో పూజ చేసి, గర్భాలయానికి తీసుకొచ్చారు. తరువాత వాస్తు పూజ, అఖండ దీపారాధన, ఇడాహవచనం, అంకురార్పణ హవనం, ద్వారతోరణ పూజ, వాస్తు హవనం జరిపారు. అష్టదిక్పాలకులను 8 కలశాలలో ఆవాహన చేసి ఆయా ద్వారాలకు ద్వార తోరణ పూజ నిర్వహించారు. దీంతో నవాహ్నిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లయింది. బుధవారం రోజు నుంచి స్వామివారు దీక్షలో ఉండడంతో స్వామివారికి పవళింపు సేవలు నిలిపివేస్తారు. ఈ కార్యక్రమాల్లో ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉప ప్రధానార్చాకులు, కోటి రామస్వరూప్, అమరవాది రామానుజానాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు, మధుసూదనాచార్యులు, అర్చకులు, వైదిక పెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ధ్వజ పట భద్రక మండల లేఖనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రామాలయంలో ధ్వజపట భద్రక మండల లేఖనం, సాయంత్రం గరుడాధివాసం జరుపనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.