కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 6: తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం జాతీయ రహదారుల దిగ్భంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ – జగ్దల్పూర్ జాతీయ రహదారిపై రామవరం ఎస్బీసీ నగర్ గోధుమవాగు వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చగా ఉంటే బీజేపీ ఓర్వడం లేదని ఆరోపించారు.
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను విడనాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కొత్తగూడెం ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు శాంతి, అన్వర్‌పాషా, కరుణాకర్, పరంజ్యోతిరావు, ఉమర్, రాజుగౌడ్, రజాక్, బీమా శ్రీధర్, రావి రాంబాబు, మసూద్, సుందర్రాజ్, యూసుఫ్, కేకే శ్రీను, వాసు, భాస్కర్, అనుదీప్, కొల్లు పద్మ, గౌస్, ఉషారాణి పాల్గొన్నారు.