భద్రాచలం, ఏప్రిల్ 5: భద్రాద్రిలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు నవాహ్నిక మహోత్సవాలకు అంకురారోపణ చేయనున్నారు. రామాలయంలో పాంచరాత్రగమ శాస్త్రం ప్రకారం ఉదయం 7 గంటలకు ఉత్సవమూర్తులను బేడా మండపంలోకి సంప్రదాయ బద్ధంగా తీసుకువస్తారు. 8 గంటలకు పవిత్ర గోదావరి నుంచి తీర్థపు బిందె తీసుకువస్తారు. అనంతరం దైవ ప్రార్థన, విశ్వక్సేన ఆరాధన చేపడతారు. స్వామివారి ఉత్సవమూర్తులకు నవ కలశాలతో ఉత్సవారంభ స్నపనం చేస్తారు. సాయంత్రం ఆస్థాన మండపంలో స్వామివారికి పుట్టమన్నుతో పూజ చేస్తారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో ఆలయ ఈవో బానోత్ శివాజీ, అధికారులు శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు, ఉభయదాతలు టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 9న ఎదుర్కోలు ఉత్సవం, 10న శ్రీరామనవమి, 11న మహా పట్టాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
వైకుంఠ రాముడు భద్రాద్రి రాముడు..
సుప్రసిద్ధమైన శ్రీరామ క్షేత్రం, నిత్యోత్సవాది అన్ని ఉత్సవాల్లో అలరారే ఇక్కడి స్వామికి భోగ రాముడు అని పేరు. స్వయం వ్యక్తమూర్తి. చతుర్భాజలతో శ్రీరాముడున్న ఏకైక క్షేత్రం. బ్రహ్మాది దేవతలు, నారవాది మహర్షులు, వరకాలాది(తిరుమంగై అశ్వార్) అళ్వారులు, ఆదిశంకరాచార్యాది తత్తవేత్తలు, శ్రీరాముదాసాది మహా వాగ్గేయకారులు, త్యాగరాజాది నాదోపాసకులు ఎందరో ఈ స్వామిని సేవించి తరించారు. ముఖ్యంగా శ్రీ భక్తరామదాసు సర్వతోముఖ సంసేవనం వల్ల ఈ క్షేత్రం విశ్వవిఖ్యాతమైంది. ఇది పంచరామాక్షేత్రానికి మూలబిందువు. ఇది శ్రీ పంచరాత్రామోక్తాముగా, శ్రీ వైష్ణవి సాంప్రదాయానుగుణంగా నిత్యారధ నాది మహోత్సవం అన్ని సేవలు జరిగే ప్రామాణికమైన క్షేత్రం. ఇక్కడి స్వామివారికి వైకుంఠ రాముడని పేరు. ఇది పంచరామి క్షేత్రాల్లో మొదటి క్షేత్రం…
శోక రాముడి ఆవాసం పర్ణశాల..
ఇది శ్రీరామాయణంలో పంచవటిగా వ్యవహరింపబడిన ప్రాం తం. శ్రీరామాయణానికి ప్రాణప్రదాలైన ప్రధాన ఘట్టాలన్నీ జరిగిన ప్రాంతమిదే. శ్రీసీతారామలక్ష్మణులు తమ వనవాస కాలంలో ఎక్కువ రోజులు(11 మాసాల 10 రోజులు) నివాసం ఉన్న పర్ణశాల ఇక్కడే ఉంది. శూర్పణఖ నాసిక కర్ణేచ్ఛేదనం, 14వేల మంది కర దూషణాది రాక్షసుల వధ, సీతాపహరణం, మాయలేడిగా మారీచుడు రావడం, జటాయవు రావణున్ని ఎదుర్కొనడం లాంటి ప్రధాన ఘట్టాలన్నీ ఇక్కడే జరిగాయి. వాటికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. పర్ణశాలను ఆ నాడు నిర్మించుకున్న ప్రాంతంలోనే ఇప్పుడొక పర్ణ కుటీరం, సీతమ్మను అపహరించిన ప్రాంతం, మాయలేడి పాదముద్రలు, వేషాన్ని మార్చుకున్న చుప్పనాటి చెట్టు గల ప్రాంతం, సీతమ్మ పసుపు కుంకుమలుగా వాడుకున్న పసుపు రాళ్లు, కుంకుమ రాళ్లు, నారచీరెలు ఆరేసుకున్న చారబండలు, సీతారాములు ఆడుకున్న వామన గుంటలు, కంద మూలాలు ఆరగించిన రాతి కంచాలు, సీతమ్మ స్నానం చేసిన పద్మ సరస్సు, (అదే ఇప్పటికీ సీతవాగు) ఆమెకు రక్షణగా శ్రీరాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుర్తులన్నీ నాటి రామాయణ కథను మళ్లీ మన కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుంటాయి. సీతారాముల పవిత్ర శ్రీపాద స్పర్శతో పావనమైన ప్రాంతమిది. సీతమ్మను అపహరించిన చోట శ్రీరాముడు సీత కోసం శోకమూర్తిగా పరితపించిన చోటుకావడంతో పెద్దలు ఇక్కడ శ్రీరాముడిని ప్రతిష్ఠించి శోకరాముడిగా నామకరణం చేశారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భక్తులు పర్ణశాల రాముడినీ దర్శించుకుంటారు.
యోగరాముడి శ్రీరామగిరి క్షేత్రం
ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో 8కిలోమీటర్ల దూరంలో ఉంది. నిలకడగా ప్రవహించే గోదావరి నదీ తీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండనే శ్రీరామగిరి అని పేరు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడైన చాతుర్మాస్యప్రతాన్ని ఆచరించాడని స్థల పురాణం చెబుతోంది. పర్ణశాలలో సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం(వనక్షేత్రం) చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. రాముడు సీతమ్మ కోసం తపస్సు చేసినట్లు చరిత్ర చెబతున్నది. ఈ సమయంలో అప్పుడు మాతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె ఆతిధ్యాన్ని స్వీకరించి ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని తెలుస్తోంది. ఆ శబరి మాత పేరుతోనే ఇక్కడి నదిని శబరి అంటారు.
ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహిత సంబంధం గల పవిత్ర ప్రాంతమిది. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో(రెక్కపల్లి) జటాయువు రెండవ రెక్క పడిపోయిన చోటు. రెక్కను చూసి జటాయువును చూశారని, రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకొని మరణించిన జటాయువుకు శాస్ర్తోక్తంగా దహన సంస్కారాలు చేసి, గోదావరి తీరంలో ఓ పెద్ద శిలపై దానికి పిండ ప్రదానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ శిలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ కొండపై శ్రీరాముడు యోగం చేయడం వల్ల రామున్ని ఈ ప్రాంతీయులు యోగరాముడిగా పిలుస్తారు. జటావల్కలధారిగా ఉండే ఈ స్వామికి సుందరరాముడు అని కూడా పేరు. శ్రీరాముడు ఇక్కడి నుంచి లంకకు ప్రయాణమవడం ఇక్కడ రాముడిని మహర్షులు దక్షిణాది ముఖాన ప్రతిష్ఠించారు.
వన రాముడు జగదభిరాముడు..
సీతాపహరణం జరిగిన తర్వాత రామలక్ష్మణుడు సీతాదేవి కోసం దండకారణ్యమంతా కలియ తిరిగారు. సీతను అపహరించడంతో దుక్కితుడైన శ్రీరాముడిని లక్ష్మణుడు ధీర గంభీరుడై ఓదార్చిన ప్రాంతమిది. అంతేకాక మాయలేడిగా వచ్చి సీతాపహరణానికి కారకుడైన మారీచుని శ్రీరాముడు సంహరించిన ప్రాంతం కూడా ఇదే. వృక్షే వృక్షే చపశ్యామి రామం కృష్ణాజీనాంబరం అని మారీచుడు అన్న రీతిగా దండకారణ్యమంతటా, అరణ్యంలో ప్రతి చెట్టులో కూడా శ్రీరామున్ని దర్శించిన ప్రాంతమిదే. నైమిశా రణ్యం అనే ఉత్తరప్రదేశ్‌లోని ఓ క్షేత్రం ఏ విధంగా అడవినే భగవంతుడిగా ఆరాధిస్తారో అదేవిధంగా ఇక్కడి రాముడిని ఒక వృక్షం రూపంలో ఆరాధిస్తారు. కొన్ని వందల ఏళ్లకు ముందు ఇక్కడ రెండు పెద్ద పెద్ద టేకు, మద్ది చెట్లను ఆ ప్రాంత గిరిజనులు కొస్తున్నారు.
అటవీశాఖ వారు చాలాకాలం క్రితమే వాటిని పురాతన వృక్షాలుగా గుర్తించి ఈ రెండు చెట్లకు రామలక్ష్మణ వృక్షాలు అని పేరు పెట్టారు. ఆ రెండింటిని దండకారణ్య వృక్షాల ప్రతినిధులుగా భావిస్తారు. ఆ ప్రాంతాన్నే వనమార క్షేత్రంగా పిలుస్తారు. ఈ ప్రాంతం భద్రాచలం క్షేత్రానికి తూర్పు ఆగ్నేయ దిశగా శబరి నది దాటగానే తీరాన ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీఆర్‌పురం నుంచి దారపల్లికి 15 కిలోమీటర్లు వాహనాల్లో ప్రయాణించవచ్చు. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. అది మనోహరమైన దండకారణ్యం. దట్టమైన అటవీ మధ్యలో ఆ రెండు చెట్లు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇది వన రాముడిగా పెద్దలు చూసిన వనరామక్షేత్రం. పంచరామక్షేత్రాల్లో ఇది నాల్గవది. ఎత్తైన రామలక్ష్మణ చెట్లు ఇప్పటికీ పర్యాటకులకు దర్శనమిస్తాయి.