ఖమ్మం సిటీ, ఏప్రిల్ 4: అమ్మాయిలు అదరగొడుతున్నరు. పురుషులకు దీటుగా బ్యాట్‌ను ఝుళిపిస్తున్నరు. స్పీడైన బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నరు. మండే ఎండలను ఏమాత్రం ఖాతరు చేయకుండా గెలుపే లక్ష్యంగా ఆటాడుతున్నరు. వెరసి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జాతీయ మహిళల టీ 20 క్రికెట్ డే అండ్ నైట్ లీగ్ టోర్నమెంట్ ఆసక్తికరంగా కొనసాగుతున్నది. రెండో రోజు తొలి మ్యాచ్‌లో బీహార్ డిఫెండర్స్, ఢిల్లీ ఏంజెల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బీహార్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఏంజెల్స్ జట్టు ఆది నుంచీ తడబాటుకు గురైంది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బీహార్ డిఫెండర్స్కు చెందిన చాందినీ యాదవ్ నిలిచింది. ఇరు జట్లను ఖమ్మం టూటౌన్ సీఐ శ్రీధర్ పరిచయం చేసుకున్నారు. కాగా రెండో లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ ట్రాషర్స్, చెన్నై షార్క్ జట్లు బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన తెలంగాణ.. బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. జట్టులోని యోగితా రావత్ 35 (25), చంపా 22 (18), ప్రసన్న 22 (17) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై షార్క్ కడపటి వార్తలు అందేసరికి 93 బంతుల్లో 134 పరుగులు చేయాల్సి ఉంది.