ఖమ్మం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని మండలం కేంద్రాల్లో రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు ధాన్యం కొనుగోలుపై దీక్షలు నిర్వహించాయి. పార్టీ నాయకులు నల్ల జెండాలతో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దీక్ష శిబిరాల వద్ద కేంద్ర మొండివైఖరిని ఎండగట్టారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ దీక్షలో మంత్రి అజయ్‌కుమార్ పాల్గొన్నారు. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేంతవరకు పోరాటం ఆగదని మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం పాటిస్తున్నదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఏన్కూరు, తల్లాడ, వైరా, ఖమ్మం రూరల్ మండలాల దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యమ చరిత్ర కలిగిన టీఆర్ఎస్కు కేంద్రం మెడలు వంచే పద్ధతులు తెలుసని, యాసంగిలో వడ్లు కొనేవరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ దమననీతిని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బూర్గంపహాడ్‌లో చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విచ్చేసి కేంద్ర కుయుక్తులను ఎండగట్టారు. ఇల్లెందు, టేకులపల్లిలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతున్నదని, దీని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. నేలకొండపల్లి దీక్షలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేంద్రం యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనన్నారు. పాలేరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు దీక్షలు చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన దీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొన్నారు.
బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ, మధిర మండలాల దీక్షల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి దీక్షలో అశ్వారావుపేట శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపుమేరకు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. భద్రాచలంలో చేపట్టిన దీక్షలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, వైరాలో శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి దీక్షలో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.