పాల్వంచ, ఏప్రిల్ 3: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఏడాదికాలంగా అనేకసార్లు ప్రధాని మోదీని కలిసినా ఆయన స్పందించలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఇదే విషయంపై కేంద్రమంత్రులతో 20 సార్లు సమావేశమైనా వారు కుంటి సాకులు చెప్పారని అన్నారు. పైగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి లబ్ధిపొందేలా బీజేపీ నేతలు చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని అన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో ఒకలా, ఇతర రాష్ర్టాల ధాన్యం కొనుగోలు విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాత పాల్వంచలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎంపీ నామా మాట్లాడారు. తెలంగాణ రైతులు పండిస్తున్న ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంఎఫ్‌టీ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాల వల్ల తెలంగాణ సస్యశ్యామలమై రైతుల కళ్లలో ఆనందం కన్పిస్తున్న సమయంలో కేంద్రం కొర్రీలు పెట్టి వారిని సాధిస్తోందని అన్నారు. ధాన్యం విషయంలో కేంద్రంలోని మంత్రులు ఒక తీరుగా, రాష్ట్ర బీజేపీ నాయకులు మరో తీరుగా మాట్లాడుతున్నారని అన్నారు. అసలు తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన మాటలు, పీయూష్‌గోయల్ మాట్లాడిన మాటల వీడియోలను విలేకరులకు చూపించారు. బాయిల్డ్ రైస్ కొనుక్కుంటే నూకలు వస్తాయని, వాటిని రైతులే తినాలని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 11 వరకు నిర్వహించనున్న ప్రత్యేక నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం విషయంలో కేంద్రం వివక్ష చూపడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్రంపై చేపట్టే నిరసనలో టీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీలూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, బిందుచౌహాన్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బదావత్ శాంతి, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, టీఆర్ఎస్ నాయకులు మంతపురి రాజుగౌడ్, మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.