ట్రాఫిక్ చలాన్ల రాయితీకి నేడే ఆఖరు
వెంటనే ఫైన్ చెల్లించాలని పోలీస్‌శాఖ విజ్ఞప్తి
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో రూ.5 కోట్ల వరకు వసూలు
రేపటి నుంచి యథావిధిగా జరిమానా
ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్థిక భారం, అవగాహన లేమితో చాలామంది వాహనచోదకులు చలాన్లు చెల్లించలేదు. చలాన్ల క్లియరెన్స్ కోసం పోలీస్‌శాఖ వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జరిమానాలను రాబట్టుకునేందుకు భారీగా రాయితీలు ప్రకటించి వాహనదారులకు ఊరట కలిగించింది. దీంతో వాహనదారులు చలాన్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు. తమ వాహనంపై పెండింగ్ ఉన్న చలాన్లను చెల్లించారు. ఒకే వాహనంపై అధిక సంఖ్యలో చలాన్లు పెండింగ్ ఉన్నవారికి పోలీసులు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తున్నారు. శుక్రవారం నుంచి రాయితీలు ఎత్తివేయనున్న నేపథ్యంలో వాహనదారులు గురువారమే చలాన్లు చెల్లించాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 10,95,664 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.32,30,60,510 వసూలు కావాలి. 28వ తేదీ వరకు 3,51,073 చలాన్లకు సంబంధించి రూ.2,69,05,335 వసూలైంది. భద్రాద్రి జిల్లాలో 8,00,336 చలాన్లకు గాను రూ.25,59,81,720 వసూలు కావాలి. 1,95,107 చలాన్ల ద్వారా రూ.1,71,17,535 వసూలైంది.
వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్ల వసూలుకు పోలీస్‌శాఖ భారీగా రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1 నుంచి 31లోపు చలాన్లు చెల్లించాలని సూచించిన నేపథ్యంలో వాహనదారులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరి చలాన్లు చెల్లిస్తున్నారు. రాయితీ గడువు నేటితో ముగియనుండడంతో వాహనదారులు నేడు భారీగా చలాన్లు చెల్లించే అవకాశం ఉంది. ఒకే వాహనంపై అధిక సంఖ్యలో దీర్ఘకాలం నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారికి పోలీసులు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తున్నారు. శుక్రవారం నుంచి రాయితీలు ఎత్తివేయనున్న నేపథ్యంలో వాహనదారులు గురువారమే చలాన్లు చెల్లించాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ సూచిస్తున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి..
ప్రజల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తీవ్రతను బట్టి జరిమానా విధిస్తున్నది. చలాన్లు వసూలు పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్లో జరిమానా చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నది. 2018 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. వీరిలో మెజార్టీ వాహనదారుల ట్రాఫిక్ చలాన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏళ్ల తరబడి చలాన్లు పెండింగ్ ఉండడంతో పోలీస్‌శాఖ వాహనదారులకు భారీగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
పోలీస్ శాఖ కల్పించిన రాయితీలను వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో 10,95,664 చలాన్ల ద్వారా రూ.32,30,60,510 వసూలు కావాల్సి ఉంది. రాయితీ ప్రకటన తర్వాత ఈ నెల 28 వరకు 3,51,073 చలాన్లకు సంబంధించిన రూ.2,69,05,335 వసూలైంది. మిగిలిన 7,44,591 చలాన్ల నుంచి రూ.22,19,47,645 వసూలు కావాల్సి ఉంది. భద్రాద్రి జిల్లాలో 8,00,336 చలాన్ల నుంచి రూ.25,59,81,720 వసూలు కావాల్సి ఉంది. రాయితీ ప్రకటన తర్వాత 1,95,107 చలాన్ల ద్వారా రూ.1,71,17535 వసూలైంది. మిగిలిన 6,04,229 కేసుల నుంచి రూ.19,14,43,885 వసూలు కావాల్సి ఉంది.