మామిళ్లగూడెం, మార్చి 30: పోక్సో యాక్ట్ కేసుల్లోని నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా డీజీపీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం నుంచి పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజల సేఫ్టీ ఎండ్ సెక్యూరిటీకి అత్యధిక ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన సత్వర సేవలు అందించాలని సూచించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రైం ఎగైనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ, గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చొరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ఏకీకృత సేవలను విస్తరింప చేయడం లక్ష్యంగా ప్రవేశ పెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ డీసీపీలు గౌస్ అలమ్, సుభాశ్ చంద్రబోస్, ఏఆర్ కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్నకుమార్, వెంకటస్వామి, సీఐ తుమ్మ గోపి పాల్గొన్నారు.