వైరా, మార్చి 29 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మంగళవారం రెండవ రోజు సార్వత్రిక సమ్మెలో పార్టీ అనుబంధ కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీఎత్తున మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ట్రాక్టర్‌ను తాడుతో లాగి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరంచేసేందుకు చూస్తున్నదన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకపోతే దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్‌చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీ డీ కే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీచైర్మన్ నంబూరి కనకదుర్గ, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్‌రావు, కట్టా కృష్ణార్జునరావు, మచ్చా బుజ్జి, మిట్టపల్లి నాగి, బోనాల వెంకటేశ్వర్లు, దార్నా శేఖర్, మోరంపూడి బాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్, ప్రభుత్వ రంగ వాణిజ్య, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు వైరా బ్రాంచ్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ నాయకులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
సత్తుపల్లి, మార్చి 29 : కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె రెండవరోజు మంగళవారం పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. టీబీజీకేఎస్, సీపీఐ, ఏఐటీయూసీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి కేంద్ర విధానాలను ఖండించారు. టీబీజీకేఎస్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెనుబల్లి, మార్చి 29 : దేశవ్యాప్త సమ్మె రెండో రోజు పాక్షికంగా కొనసాగింది. అంగన్వాడీ కార్యకర్తలు విధులను బహిష్కరించారు. బ్యాంకుల్లో లావాదేవీలు రెండో రోజు కూడా స్తంభించాయి. సీపీఎం, సీపీఐ అనుబంధ ట్రేడ్ యూనియన్ల నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు.
కారేపల్లి, మార్చి 29: మండలంలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అఖిలపక్ష పార్టీలతోపాటు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ, ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు బస్టాండ్ సెంటర్లో గ్యాస్ సిలిండర్‌తో రోడ్డుపై బైఠాయించారు.
వేంసూరు, మార్చి 29 : మోదీ సర్కార్ కార్మికుల, ఉద్యోగుల హక్కులను హరిస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చలమాల విఠల్ రావు అన్నారు. మంగళవారం సీఐటీయూ అనుబంధ సంఘాలైన అంగన్వాడీ, ఆశ, మిషన్ భగీరథ, గోపాలమిత్ర, భవన నిర్మాణ, విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు టెంట్ వేసుకుని నిరసన దీక్ష చేశారు. భారీ ప్రదర్శన అనంతరం మానవహారం నిర్వహించారు.