ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక సమ్మె రెండో రోజు మంగళవారమూ విజయవంతమైంది. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగాయి. అఖిలపక్ష నాయకులు అశ్వారావుపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ప్రభు త్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని విరమించుకోవాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆర్టీసీ, మున్సిపల్, టెలికం, పోస్టల్, సింగరేణి కార్మికులు, ఆశావర్కర్లు, హమాలీలు, అసంఘటిత కార్మికులు భాగస్వాములయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు బస్‌డిపోల ఎదుట తెల్లవారుజామున 4 గంటలకే బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కార్మిక చట్టాల జోలికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
మున్సిపల్ కార్మికులు తెల్లవారుజామున విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మంలోని ధర్నాచౌక్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి మానవహారం చేపట్టారు. బ్యాంకుల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వైరాలో టీఆర్ఎస్ నాయకులు భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలంటూ ట్రాక్టర్‌ను తాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వివిధ రాజకీయ పక్షాల నేతలు, కార్మిక సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టాలి
ఖమ్మం వ్యవసాయం, మార్చి 29 : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొట్టాలని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ సీనియర్ నాయకుడు కనకం జనార్దన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం ఖమ్మంలోని ప్రధాన బ్యాంకులతోపాటు, ప్రైవేట్ బ్యాంకులు సైతం మూతపడ్డాయి. ఆయా యూనియన్ల నాయకులు ఇల్లెంద్ క్రాస్‌రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఎదుట నిరసన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విలీనం పేరుతో ఇప్పటి వరకు 28 బ్యాంకులను 12కు కుదించిందని అన్నారు. ఇప్పుడు జీవిత బీమా సంస్థను సైతం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఖాతాదారులపై అధిక చార్జీలు పడే ప్రమాదం ఉందన్నారు. అనంతరం జడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు టీ.శ్రీకాంత్, పీ.నాగేందర్, రామస్వామి, రామకృష్ణ, కే.ఉపేంద్రనాథ్, రమేశ్, కుమార్, కే.ప్రసాద్, విష్ణు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.