రఘునాథపాలెం, మార్చి 29 : అది శివారు గ్రామం. ఎవరు వస్తారో.. ఎందుకు వస్తారో తెలియదు. రోజూ కొత్త మనుషులు గ్రామంలో కన్పిస్తుండడం.. వరుసగా చోరీలు జరుగుతుండడంతో గ్రామస్తులు, సర్పంచ్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇలా సంఘటనలు పునరావృతం కాకూడదని ముందస్తు ఆలోచన చేశారు. గ్రామమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అందుకు రఘునాథపాలెం ఎస్సై మాచినేని రవి పూర్తి సహకారం అందించారు. గ్రామానికి వచ్చిపోయే వారిని సీసీ కెమెరాల్లో బందించేలా కాలనీ మొత్తంగా 12 కెమెరాలు పెట్టారు. చింతగుర్తి పంచాయతీ స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు.
అర్ధరాత్రి ఓ ఇంటి ప్రహారీ దూకి ఆవరణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. అచ్చం ఇలాంటి సంఘటనే కొద్ది రోజులకే మళ్లీ పునరావృతమైంది. రోజులు గడిచినా దొంగల జాడ దొరకలేదు. మరికొద్ది రోజులకు గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న సాయిబాబా ఆలయానికి చెందిన బోరు మోటారును అపహరించారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు గస్తీ కాస్తున్నా.. చోరీలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. గ్రామంలో వరుస చోరీలపై దృష్టిసారించిన పంచాయతీ పాలకవర్గ గ్రామాన్ని నిఘా నీడలో ఉంచేందుకు కంకణం కట్టుకున్నది. సర్పంచ్ మెంటెం రామారావు గ్రామంలో పర్యటించారు. ప్రధాన వీధు ల్లో ఎక్కడెక్కడ ఎన్ని సీసీ కెమెరాలు పెట్టాలనే దానిపై ఆరా తీశారు. 12 సీసీ కెమెరాలు అవసరమని గుర్తించారు. రూ.2.50 లక్షలు వెచ్చించి సీసీ కెమెరాలు తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలను ఏసీపీ బస్వారెడ్డి ప్రారంభించారు.
సంతోషంగా ఉంది
గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుని గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను పసిగట్టవచ్చు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన పాలకవర్గానికి కృతజ్ఞతలు.
– మెంటెం రామారావు, చింతగుర్తి సర్పంచ్