మామిళ్లగూడెం, మార్చి29 : ‘మన ఊరు- మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో విద్య, ఇంజినీరింగ్‌శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో గుర్తించిన పనులు, అంచనాలు, ఇన్‌ఫుట్ డాటా షీట్ నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వారం రోజుల్లోపు ప్రతి మండలంలో రెండు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించాలన్నారు. విద్య, ఇంజినీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో అంచనాలు రూపొందించి పరిపాలన అనుమతులు పొందాలని, పనులను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ‘మన ఊరు..మన బడి’లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లోని 12 పనులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయాలన్నారు.
మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు. పనుల ఫొటోలు, ఇంజినీరింగ్ అధికారులు ఇన్‌ఫుట్ డాటా షీట్ నమోదు చేసిన 24 గంటల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎకువ పాఠశాలల్లో పనులు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్యాంప్రసాద్, హేమలత, శ్రీనివాసరావు, చంద్రమౌళి, పుష్పలత, కృష్ణలాల్, గిరిజన సంక్షేమశాఖ, ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, మండల విద్యాశాఖాధికారులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.