మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది
రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు..
యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
నగరంలోని టీఆర్ఎస్ భవనంలో సమావేశం
కేంద్రానివి పచ్చి అబద్ధాలు: ఎంపీ నామా నాగేశ్వరరావు
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు
ఖమ్మం, మార్చి 27:‘దేశంలో రైతుల స్థితిగతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీసేలా కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఉగాది తర్వాత ఆందోళనలను ఉధృతం చేస్తాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలిపెడుతున్నదన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
యాసంగిలో కేంద్రం ధాన్యం కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉగాది తర్వాత ఆందోళనలను ఉధృతం చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రైతుల స్థితిగతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని మండిపడ్డారు. భారతదేశం ప్రపంచ ఆకలి సూచిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుక ఉందన్నారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడిప్పుడే అన్నం తింటున్న తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీసేలా కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వరి సాగు చేయండని, కేంద్రం ధాన్యం కొనేలా చూస్తామని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశ ప్రజల హక్కులను కాలరాస్తున్నదన్నారు.
కేంద్రం బేషరతుగా యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బాయిల్డ్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. రైతుల విషయంలో కేంద్రం అవకాశవాద ధోరణిని అవలంబిస్తున్నదన్నారు. ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలిపెడుతున్నదన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, పార్టీ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి పాల్గొన్నారు.
కేంద్రానిది మొండివైఖరి : ఎంపీ నామా నాగేశ్వరరావు
తెలంగాణను కేంద్రం దేశంలో అంతర్భాగంగా చూడడం లేదని, ధాన్యం కొనుగోలుపై మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు అనేకసార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపారని, అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించేంది కేంద్ర ప్రభుత్వమేనని, దాని ప్రకారం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు, ప్రజలను అవమాన పరుస్తున్నదన్నారు.
రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడం, పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం, సీజన్‌కు ముందే రైతుబంధు అందజేస్తుండడంతో ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నదన్నారు. ఈ విషయాన్ని కేంద్రంలో పెద్దలకు వివరించినా పట్టించుకోలేదన్నారు. 12 మంది ఎంపీలు, నలుగురు మంత్రుల ముందు కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. పంజాబ్ రైతులు రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడితే కేంద్రం తలొగ్గి వారికి క్షమాపణ చెప్పిందన్నారు. కానీ రాష్ట్రం నుంచి వడ్లు కొనుగోలు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదని, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో మొండి వైఖరితో ఉందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పోరాడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీలు, మండల పరిషత్తుల్లో తీర్మానాలు చేస్తామన్నారు. వాటిని ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు.
దక్షిణ భారత్ అంటే చిన్నచూపు : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
దక్షిణ భారత్ అంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రాష్ట్రం కేంద్రానికి ఇస్తున్న ఆదాయానికి తగినట్లుగా రాష్ర్టానికి కేటాయింపులు జరగడం లేదని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామాలు, మండల పరిషత్తుల్లో తీర్మానాలు జరగుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై నిరసనగా సోమ, మంగళవారాల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉధృతంగా ఉద్యమాలు;ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు
తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్రం వడ్లు కొనేవరకూ జిల్లాలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. కేంద్రంపై నిరసనగా ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఉంచుతామన్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రైతులకు అన్యాయం చేస్తే దెబ్బతింటరు..
వడ్లు కొనమంటే నూకలు తినమని చెప్పుడు ఏంది? రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వమైనా పడిపోవాల్సిందే. ఇప్పటికే రైతులకు సాగు గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నరు. పైగా యాసంగిలో పండించిన వడ్లను కొనలేమని చెప్తే ఎట్లా? కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వడ్లు కొని తీరాల్సిందే.
– అచ్చా అనురాధ, గ్రామస్తురాలు, తిప్పారెడ్డిగూడెం
రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కేంద్రమంత్రి గోయల్ వ్యాఖ్యలు; ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, మార్చి 27: యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని పట్వా రిగూడెంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను నూకలు తినమని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం తప్పదన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు గానే ఇక్కడి రైతులు పండించిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలు చేయాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. ఉగాది తర్వాత టీఆర్ఎస్ దశలవారీగా ఆందోళనలు చేపడుతుందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, నాయకుడు అబ్దుల్ జిన్నా పాల్గొన్నారు.
దశలవారీగా కేంద్రంపై ఉద్యమం;ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లి, మార్చి 27: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని, చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హెచ్చరించారు. పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన తీర్మాన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం రైతుల కష్టాన్ని దోచుకుంటున్నదన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నదన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడదామని, రైతులు అధైర్యపడొద్దన్నారు. రైతులకు అండగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే మంత్రుల బృందం ఢిల్లీలో గళం ఎత్తిందన్నారు. దీనికి మద్దతుగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల్లో తీర్మానాలు చేస్తున్నామన్నారు. తీర్మానాలను కేంద్రానికి చేరవేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిస్తామన్నారు. అనంతరం మండల పరిషత్ తీర్మానంపై సంతకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, నాయకులు కనగాల సురేశ్‌బాబు, మందడపు అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
కేంద్రం వడ్లు కొనేవరకూ పోరాటం ;డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
పాల్వంచ రూరల్, మార్చి 27: యాసంగిలో రైతుల వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం తప్పదని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ఆదివారం కిన్నెరసానిలో నిర్వహించిన సొసైటీ జన మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా సొసైటీల పరిధిలో తీర్మానాలు చేస్తున్నామన్నారు. సొసైటీ రుణాల రికవరీపై సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రుణాల రికవరీలో ఆస్తులు జప్తులు చేయవద్దని పలువురు సభ్యులు చైర్మన్‌ను కోరారు. అనంతరం సిబ్బందికి పే రివిజన్, ఏకీకృత ప్రమోషన్ పాలసీ, షేర్ ధనం వాపస్, వడ్డీల రాయితీలపై చర్చించారు. నూరు శాతం రుణ వసూళ్లు సాధించిన సత్తుపల్లి సొసైటీ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్యను సన్మానించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.