ఈ మహిళలు.. పెండ్లయ్యాక కొలువులు సాధించారు
కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని..ప్రణాళికతో చదివి.. పరీక్షలు రాసి విజయతీరం చేరుకున్నారు..
వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తి
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 26: పెండ్లయిందంటే చాలు ఎంతోమంది మహిళలు ఇంటికే పరిమితమవుతారు. జీవితంలో సాధించాలనుకునే లక్ష్యాలను పక్కనపెడతారు. కానీ కొందరు అనుకున్న లక్ష్యం సాధించడానికి ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొంటారు. ఆటుపోట్లను విజయానికి పునాదులుగా చేసుకుంటారు. కుటుంబ సభ్యులను ఒప్పించి, వారి సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. విజయ తీరాలు చేరుకుంటారు. ఇదే కోవలో కొందరు మహిళలు కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులు సాధించారు. సంకల్ప బలం ఉంటే విజయం దరిచేరుతుందనడానికి నిదర్శనమే ఈ అతివలు. వారి విజయగాథలు కొందరిలోనైనా స్ఫూర్తి నింపుతాయనే ఉద్దేశంతో ‘నమస్తే’ చేస్తున్న చిరు ప్రయత్నమిది..!
కుటుంబ సభ్యుల సహకారంతోనే..
మాది సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు. చిన్నప్పటి నుంచి నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల. నాకు డిగ్రీ పూర్తి కాగానే 2005లో వివాహమైంది. వివాహమైన తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కొలువు చేశా. నా భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. మేం 2011లో ఖమ్మం షిప్ట్ అయ్యాం. అత్తమామల సలహాతో 2014లో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్ మొదలు పెట్టా. అప్పుడు పాప మూడో తరగతి, బాబుకి 19 నెలలు. రోజూ ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడంతోనే సమయం గడిచిపోయేది. కుటుంబ సభ్యుల సహకారంతో శిక్షణ తీసుకున్నా. ప్రణాళిక బద్ధంగా గ్రూప్-2 చదివా. తొలి ప్రయత్నంలోనే 2016లో మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యా. అనుకున్న లక్ష్యాన్ని సాధించా.
– కోడారు సుజాత, మున్సిపల్ కమిషనర్, సత్తుపల్లి
పిల్లలు నిద్రపోయాక చదివేదానిని..
నా ప్రాథమిక విద్యాభ్యాసం తల్లాడలో జరిగింది. ఇంటర్ ఖమ్మంలో. ఇంజినీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశా. ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తూ ఎంటెక్ పూర్తి చేశాను. 2014లో వివాహమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 2016లో గ్రూప్- 2 ప్రయత్నించా. 2016లోనే కవల పిల్లలు పుట్టారు. నాకు పిల్లలతోనే రోజంతా సరిపోయేది. 2018లో పంచాయతీ సెక్రటరీ, ఎఫ్‌బీవో ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చాయి. ప్రిపరేషన్‌కు సమయం ఉండేది కాదు. పగలంతా పిల్లలతో సరిపోయేది. వారిని కుటుంబ సభ్యులు చూసుకుంటున్నప్పటికీ నా మనసంతా పిల్లలపైనే ఉండేది. ప్రతిరోజూ రాత్రి పిల్లలు నిద్రపోయాక ప్రిపేర్ అయ్యేదానిని. అలా జ్యుడీషియల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించా. మున్ముందు గ్రూప్ ఉద్యోగం సాధించాలని ఉంది.
– గుండా శ్రీహర్మ్య, జ్యుడీషియల్ డిపార్ట్మెంట్
మాది ఖమ్మం జిల్లాలోని కల్లూరు. పీజీ పూర్తి చేశా. 2016లో పెళ్లయింది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. 2018లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటికే రెండేండ్ల పాప. పరీక్షలకు సిద్ధం కావడం కష్టం అనుకున్నా. అలాంటి సమయంలో భర్త, అత్తమామలు పూర్తి సహకారం అందించారు. పాప బాధ్యతను వారు తీసుకున్నారు. ఎస్సై సాధించా. 12 నెలల పాటు పాపను వదిలి ఉండడం కష్టంగానే ఉండేది. అయినా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసి నాలో స్ఫూర్తి నింపింది. నేను పడిన కష్టానికి ప్రతిఫలం అందింది.
– లక్కినేని ప్రియదర్శిని, సబ్ ఇన్స్పెక్టర్, ములుగు