ప్రతిపక్షాలకు రైతు సమస్యలు పట్టవు ఎంపీ నామా
నేరడలో జడ్పీ చైర్మన్ లింగాల సమక్షంలో 20 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక
చింతకాని, మార్చి 27: సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని నేరడకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులు సహా కాంగ్రెస్, సీపీఐకి చెందిన 20 కుటుంబాలు ఆదివారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఎంపీ మాట్లాడారు. పార్టీ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణ రైతుల గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎంపీలు ముఖం చాటేస్తున్నారన్నారు. వారికి ప్రజల ఓట్లే కావాలని, రైతాంగం సమస్యలు పట్టవని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను తిట్టడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా తెలంగాణలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, కల్యాణలక్ష్మి షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్ల వంటి పథకాలు అమలుకావడం లేదన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి నిధులు అందుతున్నాయని, దార్శనికుడైన కేసీఆర్ మన సీఎం కావడం అదృష్టమన్నారు. ఆయన కృషితోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.