చింతకాని మండలంలో ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’
ఒక్క మండలానికే రూ.450 కోట్లు
లబ్ధిదారులు డిమాండ్ ఉన్న యూనిట్లనే నెలకొల్పాలి
తెలంగాణలో ఎక్కడైనా యూనిట్లను స్థాపించుకోవచ్చు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ప్రజాప్రతినిధులతో సమావేశం
ఖమ్మం, మార్చి 26 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ద్వారా లబ్ధి చేకూరుతుందని, దీనిపై అపోహలు అవసరం లేదని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ‘దళితబంధు’ పథకంలో భాగంగా చింతకాని మండల ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్, కలెక్టర్‌తో కలిసి మంత్రి డీపీఆర్సీ సమావేశ మందిరంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితవాడలు బంగారు మేడలు కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. లబ్ధిదారులు తమకు ఆసక్తి ఉన్న యూనిట్లను నెలకొల్పాలన్నారు.
ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందుతుందని, ఈ విషయంలో అపోహలు అవసరం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. దళితబంధు పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రత్యేక అధికారులు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, కలెక్టర్‌తో కలిసి శనివారం డీపీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పితే నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అలా జరుగకుండా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. దళితబంధు ద్వారా ఒక్క చింతకాని మండలానికే రూ.450 కోట్ల మేర లబ్ధి చేకూరనుందన్నారు.
దళిత వాడలు బంగారు మేడలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చింతకాని మండలం ఖమ్మం నగరానికి దగ్గర్లో ఉన్నందున.. అక్కడైనా యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రూ.10 లక్షల సాయంతో లబ్ధిదారులు ఎన్ని యూనిైట్లెనా స్థాపించుకోవచ్చని, లేదంటే ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక పెద్ద యూనిట్‌నైనా స్థాపించుకోవచ్చని, తెలంగాణలో ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేసుకోచ్చని సూచించారు. వృత్తి నిపుణులకు మొదటి ప్రాధాన్యంగా యూనిట్ల గ్రౌండింగ్‌కు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. చింతకాని జడ్పీటీసీ కిశోర్, ఎంపీపీ పూర్ణయ్య, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే రూ.100 కోట్లు: కలెక్టర్
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ చింతకాని మండలంలోని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు తెరవడం ప్రారంభించామన్నారు. ఈ మండలానికి ఇప్పటికే రూ.100 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. అనుభవం, నైపుణ్యం ఉన్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యం కల్పించామని, యూనిట్ల గ్రౌండింగ్‌కు సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే వారం నుంచి గ్రౌండింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
దళితబంధు.. ఓ మైలురాయి: జడ్పీ చైర్మన్
ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ దళితబంధు పథకం ఓ మైలు రాయిగా నిలువబోతోందన్నారు. దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ప్రతి దళిత కకుటుంబానికీ రూ.10 లక్షల పెట్టుబడి సాయాన్ని అందించాలన్న సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన ఎంతో గొప్పదని అన్నారు.
కేసీఆర్‌తోనే దళిత సాధికారిత: తాతా మధు
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ఎంతో మేధోమథనం చేసిన తరువాతనే సీఎం కేసీఆర్ ఈ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆయన ద్వారానే దళిత సాధికారత సాధ్యమని స్పష్టం చేశారు.