సత్తుపల్లి టౌన్, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దశల వారీగా పోరాటానికి సిద్ధం కావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతుంటే, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులను మభ్యపెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ర్టాల్లోని చిన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం హోదా ప్రకటించలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారన్నారు. ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రజల వాణి వినిపించేందుకు కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్ర ప్రజలతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చినందుకు పంజాబ్ రైతులు ఏడాదిపాటు ఉద్యమం చేపట్టారన్నారు. చివరికి ప్రధాని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణ చెప్పారని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశారని గుర్తుచేశారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 26న పంచాయతీల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేయాలన్నారు. 27న మండల పరిషత్ కేంద్రాల్లో ఎంపీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు, 28న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్, 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, 30న జిల్లా పరిషత్ సమావేశం, 31న మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాలు చేయాలన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన ప్రకటించాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, ముఖ్యనాయకులు రఫీ, అంకమరాజు, వల్లభనేని పవన్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, పద్మజ్యోతి, నాగుల్‌మీరా, చల్లగుండ్ల కృష్ణయ్య, గాదె సత్యం, వివిధ మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం కావాలి..ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పై భారం పెంచే విధంగా డీజిల్, పెట్రోలు, గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పోరాటానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో రైతులు ఎక్కువగా ధాన్యం పండిస్తారని, కేంద్రం ప్రతి గింజా కొనుగోలు చేసేలా మెడలు వంచాలన్నారు.