ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 19 : ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో విద్యాశాఖాధికారులు పూర్తిస్థాయిలో ఖాళీల గుర్తింపునకు కసరత్తు చేస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల వివరాలను ఆయా జిల్లాల విద్యాశాఖలు ఇప్పటికే సేకరించాయి. 317 జీవో ద్వారా జిల్లా క్యాడర్ బదిలీల అనంతరం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయంపై స్పష్టతతోపాటు ఎన్ని పోస్టులను నియామక ప్రక్రియలో భర్తీ చేయాలనే అంశంపై విద్యాశాఖ అధికారులు చర్చించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి పూర్తి సమాచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు సోమవారంలోగా అందించనున్నారు. చివరగా 2017లో టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను నిర్వహించారు.
ఇప్పుడు నూతన జోనల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు రావడంతోపాటు 317 జీవోతో బదిలీల ప్రక్రియ పూర్తవడంతో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ అన్ని కసరత్తులూ చేస్తోంది. మరోవైపు.. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధ్యాయ పోస్టులు సాధించడానికి సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో ఉన్న అభ్యర్థులు పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్ల వద్ద శిక్షణ పొందడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో పాఠశాల స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పీఈటీలు, బాషా పండితులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలో 342 ఎస్జీటీ పోస్టులు..
ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇటీవల జీవో 317 ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ బదిలీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల్లో జిల్లా కేటగిరీ పరిధిలో ఖమ్మం జిల్లాకు 601 మంది వచ్చారు. వీరిని ఉపాధ్యాయులు అవసరమున్న మారుమూల ప్రాంతంలోని పాఠశాలల్లో నియమించారు. ఇలా సర్దుబాట్లు చేసిన అనంతరం కూడా 900కి పైగా ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. వీటిల్లో 342 పోస్టులు ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉన్నాయి. మిగిలిన 550 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. వీటిల్లో 70 శాతాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 30 శాతాన్ని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం-74, ఫిజికల్ సైన్స్-18, బయాలజికల్ సైన్స్ -117, ఇంగ్లిష్-40, సోషల్ స్టడీస్-178, తెలుగు-48, హిందీ-28 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం ప్రాతిపదికన భర్తీ చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖాళీలు లేకుండా పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే పాఠశాలల వారీగా, కేటగిరీల వారీగా క్యాడర్ స్ట్రెంగ్త్, ఖాళీలు, వర్కింగ్ టీచర్ల వివరాలను ఇటీవల జరిగిన సమావేశంలో ఎంఈవోల నుంచి ఖమ్మం డీఈవో సేకరించారు. ఆ వివరాలను సోమవారంలోగా విద్యాశాఖ కమిషనర్‌కు అందజేయనున్నారు.
భద్రాద్రి జిల్లాలో 699 ఖాళీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 4,368 మంది ఉపాధ్యాయులకుగాను 3669 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మొత్తం 699 ఖాళీలు ఉన్నట్లు తేలింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పీడీలు, భాషా పండితులు, పీఈటీలు, క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్లు, మ్యూజిక్ టీచర్లు, గ్రేడ్-2 హెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఖాళీల భర్తీకి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఎంఈవోలతో జిల్లా విద్యాశాఖాధికారి సమావేశమయ్యారు.