పాలకవర్గ సభ్యుల సంఖ్య 14 నుంచి 18 పెంపు
కమిటీల పదవీ కాలం గడువు మరో ఏడాది పొడిగింపు
అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ఆమోదం
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 16 నమస్తే తెలంగాణ : మార్కెట్ యార్డులకు మంచి రోజులొచ్చాయి. గతంలో ఏడాది వరకు ఉండే కమిటీల పదవీ కాలాన్ని తొలుత ఆరు నెలలు, తర్వాత మరో ఆరు నెలలు పొడిగించేవారు. దీంతో ప్రతి రెండేళ్లకోసారి కొత్త కమిటీని ఎన్నుకునేవారు. ఈ సారి కమిటీల పదవీ కాలాన్ని మూడేళ్లకు పెంచడంతో కమిటీలకు పూర్వవైభవం రానుంది. దీంతోపాటు 14 మంది ఉన్న సభ్యుల సంఖ్యను 18కి పెంచారు. రాజకీయంగా పదవులు ఇవ్వడంతోపాటు ఎక్కువమంది రైతులను కమిటీలోకి తీసుకొని వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలోనే పెద్ద వ్యవసాయ మార్కెట్ ఉంది. తా జాగా కొత్తగూడెంలోనూ అదే తరహాలో మార్కెట్‌ను నిర్వహించాలనుకున్న ప్రభుత్వం.. ఇక్కడ కూడా డైలీ మా ర్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు సెస్‌ల రూపంలోనే ఆదాయం వచ్చే కమిటీల యార్డుల్లో మిర్చి, అపరాలు, పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆరు ఉన్నాయి. ఒక్కో మార్కెట్ కమిటీలో 14 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇం దులో ఎనిమిది మంది స్థానిక నాయకులు, ఇద్దరు ట్రేడర్లు, ఒక చైర్మన్, ఒక మార్కెట్ కమిటీ సెక్రటరీ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్‌గా గ్రామం అయితే సర్పంచ్, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైరన్, చైర్పర్సన్లను ప్రభుత్వం నియమిస్తుంది. ఎన్నికైన పాలకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రస్తుతం పాలకవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుండగా.. ఈ గడువును మరో ఏడాది పొడిగించారు. అదే విధంగా ఒక్కో పాలకవర్గంలో ప్రస్తుతం 14 మంది సభ్యులుండగా.. మరో నలుగురిని నామినేట్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై అసెంబ్లీలో మంత్రి బిల్లు ప్రవేశపెట్టడం, దానిని ఆమోదించడం కూడా జరిగిపోయాయి. ఈ నిర్ణయంపై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం..
రైతుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేసేందుకు మార్కెట్ పాలకవర్గాల పదవీకాల గడువును రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు పెంచడం సంతోషంగా ఉంది. దీనివల్ల పదవిలో ఉన్న వారు రైతులకు మరింత సేవ చేసే వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గంలో 14 మంది సభ్యులుండగా ఆ సంఖ్యను 18కి పెంచడం వల్ల మార్కెట్ కమిటీల్లో మరికొందరికీ పదవులు వస్తాయి.
–భూక్యా రాంబాబు, ఏఎంసీ చైర్మన్, కొత్తగూడెం